ప్రభాస్ 'కల్కి' రికార్డును బద్ధలు కొట్టిన 'దేవర'
మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంత స్టార్ హీరోలు మరే పరిశ్రమలోను ఉండరు. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ... ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంటుంది. తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయంలో కొన్నాళ్ల నుంచి తెలుగు ఫిలింనగర్ లో చర్చలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయిపోయారు. అయినా కలెక్షన్లలో సింహభాగం తెలుగు సినీ పరిశ్రమ నుంచే వస్తోంది. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ కూడా గ్లోబల్ హీరోగా మారిపోయిన తర్వాత అతన్నుంచి దేవర చిత్రం వచ్చింది.
సలార్, కల్కిని దాటేసిన దేవర
టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో దేవర దూసుకుపోతోంది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు తగ్గలేదు. తిరిగి సలార్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు. ఆ సినిమా మొదటిరోజు రూ.75.98 కోట్లు సాధించగా, తర్వాత వచ్చిన కల్కి సినిమా రూ.77.65 కోట్లు సాధించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల రికార్డులను దేవర తిరగరాసింది. ఈ సినిమా మొదటిరోజే రూ.87.45 కోట్లు సాధించి ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ నటించిన రెండు సినిమాలకన్నా చాలా ఎక్కువగా కలెక్షన్లను తెలుగులో రాబట్టింది.

అన్ని సెంటర్లలో తారక్ అభిమానులు
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అని మరోసారి నిరూపితమైందంటున్నారు. ఏ, బీ, సీ సెంటర్లలో తారక్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వచ్చిన కలెక్షన్లను బట్టి చూస్తే తెలుగులో కూడా టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అనే నిరూపితమైందని విశ్లేషకులు అంటున్నారు. సలార్, కల్కి.. రెండూ విడుదల రోజే పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ దేవర మాత్రం మిక్స్ డ్ టాక్ అందుకుంది. అయినా దేవరకు వచ్చిన కలెక్షన్లే ఎక్కువగా ఉండటం విశేషం. సినిమా చూసిన అభిమానులంతా పాజిటివ్ టాక్ అందించారు. కొందరు మాత్రం మొదటి భాగం బాగుందంటే మరికొందరు మాత్రం రెండో భాగం బాగుందన్నారు. ఇంకొందరు రెండోభాగంలో సాగదీత ఎక్కువైందన్నారు. కలెక్షన్ల విషయంలో మున్ముందు మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications