'మహావతార్ నరసింహ' సునామీలో కొట్టుకుపోయిన 'హరిహర వీరమల్లు' ..!
ఈ వీకెండ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశగా ఎదురుచూసిన 'హరిహర వీరమల్లు' సినిమా భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఆలస్యంగా విడుదలైనప్పటికీ, తొలిరోజు కలెక్షన్లతో దుమ్మురేపినా, మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో రెండో రోజు నుంచి వసూళ్లు భారీగా పడిపోయాయి. కానీ ఊహించని విధంగా హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన 'మహావతార్ నరసింహ' చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
ప్రారంభంలో పెద్దగా ప్రభావం చూపకపోయినా, 'మహావతార్ నరసింహ' మంచి రివ్యూలు, బలంగా వ్యాపించిన మౌత్ టాక్‌తో రెండో రోజు నుంచి అసలు రచ్చ మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నటించిన, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'హరిహర వీరమల్లు'ను ఓడించి, బాక్సాఫీస్ వద్ద సాలిడ్ లీడ్‌తో దూసుకుపోవడం విశేషం.

రెండో రోజున 'మహావతార్ నరసింహ' టికెట్ సేల్స్ 'హరిహర వీరమల్లు' కన్నా దాదాపు రెట్టింపు కావడం సినిమా విజయానికి నిదర్శనం. హైదరాబాద్‌లో 'హరిహర వీరమల్లు'కు ఉన్న షోలతో పోలిస్తే చాలా తక్కువ షోలు ఉన్నప్పటికీ, 'మహావతార్ నరసింహ' షోలు 75-80% హౌస్‌ఫుల్‌గా నిలవడం మామూలు విషయం కాదు.
ఈ వీకెండ్ బాక్సాఫీస్‌లో ఒక టాప్ స్టార్ సినిమా హైలెట్ అవుతుందని భావించినప్పటికీ, పోటీలో లేదనుకున్న 'మహావతార్ నరసింహ' ఇప్పుడు విజేతగా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు పిల్లలను కూడా థియేటర్లకు ఆకర్షిస్తూ అద్భుతమైన కలెక్షన్లను సాధిస్తోంది.
హిందీలో కూడా 'మహావతార్ నరసింహ' 'హరిహర వీరమల్లు'ను ఓ రేంజ్‌లో ఓడించింది. మూడు రోజుల్లో 'హరిహర వీరమల్లు' హిందీలో కేవలం కోటి లోపే నెట్ కలెక్షన్లు సాధిస్తే, 'మహావతార్ నరసింహ' తొలి రోజే 2.45 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు వసూళ్లు మరింత బలంగా ఉండటంతో, హిందీలో కూడా ఈ సినిమాకు మంచి లాంగ్ రన్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు పోటీలో లేని సినిమా, రేసులో విన్నర్ అనుకున్న సినిమాను ఓడించి సంచలనం సృష్టించింది.ఈ లెక్కన చూసుకుంటే మూడు రోజుల్లో కలిపి దాదాపు రూ.20 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతార, సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ ఈ 'మహావతార్ నరసింహా' సినిమాను నిర్మించింది.












Click it and Unblock the Notifications