సినిమా ఫెయిలైనా.. మహేష్ ఫెయిలవలేదు: త్రివిక్రమ్
మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న రచయిత, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో విడుదలైన గుంటూరు కారం సినిమా కు ఎక్కడా పాజిటివ్ టాక్ రాలేదు. బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు వేచిచూడాల్సి ఉంది. దాదాపు 14 సంవత్సరాల విరామం తర్వాత మహేష్ బాబు - త్రివిక్రమ్ కలిసి పనిచేయడంతోపాటు అల వైకుంఠపురం తర్వాత వస్తున్న త్రివిక్రమ్ సినిమా కావడంతో ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలు పెట్టుకున్నారు.
అయితే ఈ సినిమా ఘోరంగా నిరాశపరిచింది. మొదటిగా త్రివిక్రమ్ సినిమా అనగానే.. ఆయన రాసే డైలాగులతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కు అందరూ కనెక్ట్ అవుతారు. గుంటూరు కారంలో కూడా త్రివిక్రమ్ మార్క్ డైలాగులు ఉంటాయనుకున్నారు. అయితే ఆ సినిమాలో అసలు త్రివిక్రమ్ తరహా డైలాగ్ ఒక్కటి కూడా లేదు. ఈ సినిమా తీసింది అతనేనా? అనే సందేహం కూడా అందరికీ కలిగింది.

అయితే ఒక్క మహేష్ బాబు ఛరిష్మా మీద ఆధారపడే ఈ సినిమా ముందుకు నడుస్తోందని చెప్పొచ్చు. డ్యాన్సులు, టైమింగ్, పెర్ఫార్మెన్స్ లాంటివన్నీ వేరే రేంజ్ లో ఉన్నాయి. దీనికోసం మహేష్ బాబు చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు. తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ది పాత వీడియో ఒకటి వైరలవుతోంది.
అందులో త్రివిక్రమ్ మాట్లాడుతూ మహేష్ బాబు సినిమాలు ఫ్లాపైనా మహేష్ బాబు మాత్రం ఫెయిలవలేదని, అక్కడ తను చాలా కొత్తగా చేశాడంటూ త్రివిక్రమ్ చెబుతాడు. ప్రస్తుతం గుంటూరు కారం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనా మహేష్ బాబు మాత్రం ఫెయిలవలేదు. ఆ వీడియోలో త్రివిక్రమ్ చెప్పిన మాటలను ప్రస్తుతం గుంటూరు కారంకు అన్వయించి అభిమానులు మహేష్ బాబు ఫెయిలవలేదని, తమకు కావల్సినవన్నీ ఈ సినిమాద్వారా ఇచ్చేశాడని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications