ఆ గుండె బతకాలి రా సామీ..!
ఏ ఎం రత్నం అంటేనే పెద్ద పెద్ద సినిమాలకు పెట్టింది పేరు. ఆయన పేరు వినగానే భారతీయుడు, కర్తవ్యం, ఖుషి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ గుర్తుకొస్తాయి. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం. సూర్యా మూవీస్ అని బ్యానర్ పెట్టి ఎన్నో హిట్, బ్లాక్ బస్టర్ మూవీస్ అందించారు. కర్తవ్యంతో ఆయన ప్రస్థానం మొదలైంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించారు. ఆ తర్వాత తమిళంలో తీసిన జెంటిల్ మేన్, ప్రేమికుడు చిత్రాలను తెలుగులోకి అనువదించి విజయాలు అందుకున్నారు.
తెలుగులో ఏఎం రత్నం నిర్మించిన చిత్రాల్లో స్నేహం కోసం, ఖుషి, నాగ, నీ మనసు నాకు తెలుసు, బంగారం, ఆక్సిజన్ ఉన్నాయి. వీటిలో పవన్ కళ్యాణ్ ఖుషి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతేకాక ఆయన తెలుగులోకి అనువదించిన చిత్రాల్లో అరుణాచలం, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, 7జి బృందావన్ కాలనీ హిట్స్ సాధించాయి. ఇలా సినీ కెరీర్ లో దాదాపు 90 శాతం సక్సెస్ రేటుతో దూసుకెళ్లిన రత్నంకు తాజాగా ఊహించని దెబ్బ తగిలింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు నెగటివ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు నుంచే ఈ మూవీ ప్లాఫ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్ పెద్ద దెబ్బ తీశాయని, ఏమాత్రం బాగోలేని నాసిరకంగా గ్రాఫిక్స్ చూపించారని ఆడియెన్స్, నెటిజన్స్ మండిపడుతున్నారు.

హరిహర వీరమల్లు విడుదలైన తొలి రోజున సినిమాకు రూ.40 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చి ఆశ్చర్యపరిచింది. పవన్ కల్యాణ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా హరిహర వీరమల్లు నిలిచింది. ఇక రెండో రోజు అయితే దాదాపుగా 85 శాతం మేర కలెక్షన్స్ అమాంతం పడిపోయాయి. నెగెటివ్ టాక్ నేపథ్యంలో హరిహర వీరమల్లు మూవీ ఒక్కసారిగా డౌన్ అయింది. ఏ ఎం రత్నం దాదాపు రూ. 300 కోట్లు పెట్టి తెరకెక్కించారు. అటు పవన్ కల్యాణ్ కూడా ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా కోసం కష్టపడ్డారు. ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉండి.. డిప్యూటీ సీఎం పదవి చేపడతూనే మరోవైపు సినిమాకోసం డేట్స్ ఇచ్చి ఎట్టకేలకు పూర్తి చేశారు. కానీ బ్యాడ్ వీఎఫ్ఎక్స్ కారణంగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.

అయితే ఖర్చుకు వెనుకాడకుండా ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాల్ని నిర్మించే నిర్మాతలు ఈ రోజుల్లో చాలా అరుదు. మరి తన కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాలలాంటి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు చేరువచేసిన ఏఎం రత్నం ఈ సినిమాతోనే కాకుండా భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని సామాజిక మాధ్యమాల్లో నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ గుండె బతకాలిరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications