'దేవర' ఫస్ట్ రివ్యూ: ఫ్యాన్స్‌కు పూనకాలే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో ఐదురోజుల్లో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'దేవర' సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆరు సంవత్సరాల తర్వాత తారక్ సోలో హీరోగా నటించడంతో దీనిపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఆరు సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చేశాడు. తర్వాత ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ తో మల్టీస్టారర్ గా వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ తన సన్నిహితుడైన దర్శకుడు రాజమౌళితోపాటు మరికొందరికి స్పెషల్ ప్రీమియర్ షో వేశారు.
ఎన్టీఆర్ నటన అదిరిపోయింది
దేవర సినిమా ఊర మాస్ కథతో తెరకెక్కిందని, అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని వారు ఈ షో చూసిన తర్వాత వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రాజమౌళితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, ఎన్టీఆర్ సన్నిహితులు కూడా ఈ సినిమాను చూశారు. అందరూ పాజిటివ్ గా స్పందించారు. ఈ సినిమాలో తారక్ కనపరిచిన నటనకు వారంతా ఫిదా అయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడని, అతడి హీరోయిజంకానీ, ఎలివేషన్స్ కానీ ఓ స్థాయిలో ఉన్నాయన్నారు. చివరి అరగంట అయితే దేవర పూనకాలు తెప్పిస్తుందంటున్నారు.

హీరో ఎలివేషన్లు గూస్ బంప్సే
తారక్ ఎలివేషన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయని, యాక్షన్ సన్నివేశాలను కొరటాల హాలీవుడ్ ను మించినస్థాయిలో తీశారంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా దేవర విడుదలవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1200 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టాలనే లక్ష్యాన్ని ఈ సినిమా నిశ్చయించుకుంది. అందులో ఏపీ, తెలంగాణ నుంచి రూ.50 కోట్లు టార్గెట్ గా పెట్టుకుంది. విడుదలకు ముందే ఇప్పటివరకు రూ.12 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఏపీ, తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకునేందుకు రెండు ప్రభుత్వాలు అనుమతి మంజూరు చేశాయి. ఈ సినిమా రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.












Click it and Unblock the Notifications