బిగ్ బాస్ జంట ప్రేమకు గ్రీన్ సిగ్నల్?
బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జోడీలలో డీమోన్ పవన్, రీతూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా విడుదలైన ఓ ప్రోమో వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై వస్తున్న అనుమానాలను నిజం చేసేలా ఉంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పటి నుంచే పవన్, రీతూల మధ్య ఏదో ఉందనే ప్రచారం సాగుతోంది. బిగ్ బాస్ షోలో వీరిద్దరూ గొడవ పడటం, వెంటనే కలిసిపోవడం వంటివి చూసి ప్రేక్షకులు వీరిని ఓ జంటగా చూడటం మొదలుపెట్టారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరిద్దరు ఎక్కడా తగ్గకపోవడం గమనార్హం. వరుసగా డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు స్పెషల్ ఈవెంట్స్‌లో జంటగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ చేసిన హంగామా నెట్టింట వైరల్ అవుతోంది.
వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రపోజల్
ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక షోలో రీతూ, పవన్‌కు అందరి ముందే ప్రపోజ్ చేయడం విశేషం. "నా ప్లెయిన్ లైఫ్‌ని చాలా కలర్ ఫుల్‌గా మార్చేశావు.. ఐ లవ్ యూ పవన్" అంటూ ఒక ఎర్ర గులాబీ ఇచ్చి తన మనసులోని మాటను రీతూ బయటపెట్టింది. ఈ క్రమంలో వీరిద్దరూ 'కింగ్', 'క్వీన్' అని రాసి ఉన్న టీ-షర్ట్‌లు ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇది కేవలం షో కోసం చేసిన స్కిట్టా లేక నిజమైన ప్రేమా అనేది పక్కన పెడితే, వీరి కెమిస్ట్రీ మాత్రం బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ ప్రోమోలో కేవలం పవన్-రీతూ మాత్రమే కాకుండా మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. ప్రముఖ కమెడియన్ రోహిణి, 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడికి ప్రపోజ్ చేయడం.. ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం షోలో మరో హైలైట్‌గా నిలిచింది. మరోవైపు ఇమ్మానుయేల్ తనదైన శైలిలో నైనికకు ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించి, అది కాస్తా ఫ్రస్ట్రేషన్‌గా మారడం నవ్వులు పూయించింది. తన ప్రేమను ఎవరైనా కించపరిస్తే తట్టుకోలేనంటూ ఇమ్ము చేసిన రచ్చ ఈ వారం ఎపిసోడ్‌పై క్యూరియాసిటీని పెంచింది.
మొత్తానికి బిగ్ బాస్ జంటల సందడి, బుల్లితెర నటుల ప్రపోజల్స్‌తో ఈ ఆదివారం స్టార్ మా పరివారం షో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతోంది. ముఖ్యంగా పవన్-రీతూల బంధం పెళ్లి పీటల వరకు వెళ్తుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ స్పెషల్ ఎపిసోడ్ ఆదివారం ఉదయం 11 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది.












Click it and Unblock the Notifications