చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కల్యాణ్ సినిమాలు నాలుగే
పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల కోలాహలం, శుభాకాంక్షల వెల్లువ కనిపిస్తోంది. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో వెండితెరకు పరిచయమై, అన్నయ్య చిరంజీవికి తగ్గ తమ్ముడిగా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్.. టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ దక్కించుకున్నారు. అయితే, పవన్ నటించిన చిత్రాల్లో చిరంజీవికి అత్యంత ఇష్టమైన సినిమాలు ఏవి? ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి స్వయంగా పంచుకున్న ఆ 4 ప్రత్యేక చిత్రాల విశేషాలు, ఒక సినిమాపై ఆయన ముందే చెప్పిన ఆసక్తికర జోస్యం వివరాలు తెలుసుకుందాం.
తొలిప్రేమ: పవన్ కెరీర్‌ను మలుపు తిప్పిన క్లాసిక్
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మొదటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'తొలిప్రేమ' చిత్రం అంటే తనకు ఎంతో ఇష్టమని చిరంజీవి తెలిపారు. దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఈ మెచ్యూర్డ్ లవ్ స్టోరీతోనే యూత్‌లో పవన్‌కు అపరిమితమైన ఫాలోయింగ్ మొదలైంది. పవన్ అల్లరి, నటన, కీర్తి రెడ్డి పెర్ఫార్మెన్స్ ఈ చిత్రాన్ని ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలబెట్టాయి.

బద్రి: మ్యానరిజమ్స్, యాటిట్యూడ్‌కు కేరాఫ్ అడ్రస్
చిరంజీవికి ఇష్టమైన మరో చిత్రం 'బద్రి'. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాతోనే పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకమైన మ్యానరిజమ్స్‌తో అలరించడం ప్రారంభించారు. కథ కంటే పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.

జల్సా: చిరంజీవి జోస్యం నిజమైన వేళ!
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 'జల్సా' చిత్రానికి ఒక ప్రత్యేకత ఉందంటే అది చిరంజీవి చెప్పిన జోస్యమే! పవన్ వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆడియో లాంచ్ రోజున చిరంజీవి మాట్లాడుతూ.. "నేను ఈ సినిమా చూడలేదు కానీ, ఇది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. సినిమాలో ఏమైనా లోపాలు ఉంటే ఎడిటింగ్ రూమ్‌లో నన్ను చూడమనేవారు. కానీ అల్లు అరవింద్, త్రివిక్రమ్ నన్ను ఏమీ అడగలేదు. అంటే సినిమా చాలా బాగా వచ్చిందనే నమ్మకమే దీనికి కారణం" అని వ్యాఖ్యానించారు. చిరంజీవి ఊహించినట్లుగానే 'జల్సా' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది.

అత్తారింటికి దారేది: ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన కుటుంబ కథా చిత్రం
త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్‌లో వచ్చిన మరో అద్భుత చిత్రం 'అత్తారింటికి దారేది'. ఈ సినిమా తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చిరంజీవి కొనియాడారు. అప్పటివరకు ఉన్న 'మగధీర' రికార్డులను అధిగమించి, ఈ చిత్రం టాలీవుడ్‌లో సరికొత్త 'ఇండస్ట్రీ హిట్'గా రికార్డు సృష్టించింది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఒకటి రెండు మినహా అన్ని చిత్రాలూ ఇష్టమే అయినప్పటికీ.. ఈ 4 సినిమాలు మాత్రం తన మనసుకి ఎంతో దగ్గరైనవని మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాల్లో ఆనందంగా పంచుకున్నారు.















Click it and Unblock the Notifications