నిర్మాతగా మరో మహిళ.. నాగబాబు చేతుల మీదుగా టైటిల్ లాంచ్!
శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా హన్సి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న తొలి సినిమా 'మైలురాయి'. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రఘువర్దన్ కోట్ల దర్శకత్వం వహిస్తుండగా.. తవిటిరాజు తలచింతల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో యువ నటీనటులు జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు ప్రముఖ సీనియర్ నటుడు దేవిప్రసాద్ కీలక పాత్ర పోషిస్తుండగా.. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టైటిల్ లాంచ్ పోస్టర్‌ను సీనియర్ నటుడు, నిర్మాత, ఏపీ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ''ఈ సినిమా టైటిల్ 'మైలురాయి' చాలా ఆసక్తికరంగా ఉంది. నిర్మాత హన్సిక మంచి సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఔత్సాహిక దర్శకుడు, యువ హీరోతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం. ఫిల్మ్ మేకింగ్‌లో మహిళలకు ఉండే బాధ్యత, క్రమశిక్షణ ఎంతో గొప్పవి. ఇప్పటికే అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్, నా కుమార్తె నిహారిక, సుప్రియ యార్లగడ్డ వంటి వారు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హన్సిక కూడా వారి బాటలోనే పయనిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు'' అని నాగబాబు అన్నారు.

నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ''మా హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా రూపొందుతున్న 'మైలురాయి' టైటిల్ లాంచ్ పోస్టర్‌ను నాగబాబు చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు. దర్శకుడు రఘువర్ధన్ కోట్ల మాట్లాడుతూ.. "హన్సి ప్రొడక్షన్స్ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. 'మైలురాయి' భావోద్వేగాలతో కూడిన ప్రేమకథ. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను" అని వెల్లడించారు.













Click it and Unblock the Notifications
