రాజమౌళి-మహేష్ బాబు సినిమా పేరు ఖరారు?
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా, ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి సినిమా ఇంతవరకు ఫెయిలవలేదంటే కారణం.. ఎంతో జాగ్రత్తగా ప్రతి సన్నివేశాన్ని గమనిస్తూ, ఎక్కడా రాజీపడకుండా సినిమా తీస్తారు. అంతేకాదు నిర్మాతకు లాభాల పంట పండిస్తారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాన్ వరల్డ్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.
ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు నృత్యాల పరంగా, నటన పరంగా బాగా చేసినప్పటికీ దర్శకుడి వైఫల్యంతో అది ఫ్లాపైంది. కాకపోతే రూ.230 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయమనే నమ్మకంతో ప్రిన్స్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనిమీదే మహేష్ బాబు జర్మనీ వెళ్లివచ్చాడు. లుక్ పరంగా అక్కడ టెస్ట్ లు జరిగాయి. మరోవైపు రాజమౌళి కూడా తన ఆస్థాన ఫొటోగ్రాఫర్ సెంథిల్ ను మార్చి పీఎస్ వినోద్ ను తీసుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు ఒక పేరు పెట్టారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్ ను ఖాయం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పేరులో మహేష్ బాబు, రాజమౌళి పేర్లు కలిసివస్తుండటంతో ఇదే ఖాయమవుతుందంటున్నారు. దాదాపుగా ఇదే ఫైనల్ అవుతుందని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications