'పుష్ప2'పై ఇలా చెబుతున్నందుకు సారీ: రామ్‌గోపాల్‌వర్మ
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప2'పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. భారతీయ సినీ చరిత్రలో ఈ తరహా పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయని, అటువంటి పాత్రల్లో నటించి ఆకట్టుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ సందర్భంగా పుష్ప2పై తన అభిప్రాయాలను ట్విటర్ లో ఉంచారు. సూపర్ స్టార్ రేంజ్ లో ఉన్న హీరో తన ఇమేజ్ ను పక్కనపెట్టి కథ ప్రకారం పాత్రలో ఒదిగిపోవడం అనేది అందరికీ సాధ్యంకాదని, కానీ దాన్ని సుసాధ్యం చూసి అల్లు అర్జున్ చూపించాడంటూ కొనియాడారు.
వైరుధ్యాలతో నిండివున్న పుష్పరాజ్
సినిమాను లాభాల కోసమే తీస్తుంటారని, కచ్చితంగా అన్ని కమర్షియల్ హంగులు ఉంటాయని, అటువంటి హంగులున్న సినిమాల్లో నిజానికి ఇటువంటి పాత్రను చూపించడం అంటే కత్తిమీద సామే అని, దాన్ని సుకుమార్ తీర్చిదిద్దిన విధానం సూపర్ అన్నారు. బయట ప్రపంచంలో మనకు దగ్గరగా ఇటువంటి పాత్రలు ఉంటాయనే విషయం సినిమా చూస్తున్నప్పుడు అర్థమైందన్నారు. పుష్పరాజ్ అనే పాత్ర అనేక వైరుధ్యాలతో నిండివుందని వర్మ అన్నారు. అమాయకత్వంతోపాటు అహంకారం అదేస్థాయిలో ఉందని, ఎదుటివారిని మోసం చేసే తెలివితేటలు.. ఇలా అన్నీ కలిసివున్నాయన్నారు.

విపరీతంగా మద్యం తాగడం అనేది..
ముఖ్యమంత్రితో ఫొటో దిగడానికి వెళితే అతను నిరాకరించినప్పుడు బన్నీ కనపరిచిన నటన, అలాగే షెకావత్ కు సారీ చెప్పాల్సివచ్చినప్పుడు తన అహంకారాన్ని చంపుకోవడానికి విపరీతంగా మద్యం తాగడం లాంటి సన్నివేశాల్లో బన్నీ హావభావాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయన్నారు. పుష్ప2 సినిమాను చూసిన తర్వాత తాను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని, పుష్పరాజ్ పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా చాలా తక్కువే అనిపించాడని, తాను ఈ మాట చెబుతున్నందుకు క్షమించాలన్నారు.
బలమైన భావోద్వేగాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని, ప్రేక్షకులతోపాటు సినిమా చరిత్రలో కూడా పుష్ప2 దశాబ్దాల పాటు నిలిచిపోతుందని రామ్ గోపాల్ వర్మ అన్నారు. శారీరకంగా ఏదైనా వైకల్యం ఉంటే ఆ వ్యక్తి సూపర్ హీరో కాలేడని, కానీ పుష్పరాజ్ మాత్రం సూపర్ హీరోకు కొత్త నిర్వచనం ఇచ్చాడని, గతంలో తనలో చూడని భావోద్వేగాలు, బాడీలాంగ్వేజ్ ఆ పాత్రకు, సినిమాకు బలాన్ని తెచ్చాయన్నారు.












Click it and Unblock the Notifications