స్కంద రివ్యూ: పాన్ ఇండియా మాస్ జాతర
బోయపాటి శ్రీను అంటేనే మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ అనగానే అందరిలో ఆసక్తి ఏర్పడింది. బోయపాటి రామ్ ను ఎలా చూపిస్తాడో అనే ఉత్కంఠ అందరిలో కలిగింది. అఖండ తర్వాత బోయపాటి పాన్ ఇండియా చిత్రం చేశారు. వీరిద్దరి కలయిక ఎలా ఉందో చూద్దాం.
బోయపాటి సినిమాల్లో హీరోలు శక్తిమంతంగా ఉంటారు. ఆయా పాత్రలు నడుచుకునే తీరు, ఫైట్స్ సన్నివేశాలను వెండితెరపై భారీగా ఆవిష్కరిస్తారు. అసలు సిసలు సినిమాటిక్ అనుభూతి కలిగేలా చూస్తారు. స్కంద సినిమాతోను బోయపాటి అదే ప్రయత్నం చేశారు. ఒకరకంగా ఈ సినిమా మాస్ జాతర. రామకృష్ణంరాజు పాత్రతో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు ఇద్దరు ముఖ్యమంత్రులను, వారి సామ్రాజ్యాలను చూపిస్తాడు. వర్తమాన రాజకీయాలు, ఉచిత పథకాలపై చురకలు వేస్తూ కొన్ని సన్నివేశాలను తీర్చిదిద్దారు.

సినిమాలోని కొన్ని పాత్రల్లో నిజ జీవితంలోని వ్యక్తులు గుర్తుకు వస్తారు. సినిమా మొదటి భాగంలో బోయపాటి శైలిలో వీరోచిత పోరాట ఘట్టాలున్నాయి. ఇవి అలరిస్తాయి. రెండో భాగంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు కీలకం. భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. క్లైమాక్స్ సినిమాలకు కీలకంగా మారింది. ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉందని దర్శకుడు ప్రకటించారు.

రామ్.. ఈ సినిమాలో తెలంగాణ యాసతోపాటు రాయలసీమ యాసలోను డైలాగులు చెబుతాడు. ఒకరకంగా ఆయన పాత్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రామ్ రెండు కోణాల్లే సాగే పాత్రలు, కనిపించిన విధానం, వైవిధ్యం అందరినీ ఆకట్టుకుంటాయి. బోయపాటికి తగ్గట్లుగా మారిపోయి రామ్ పరకాయ ప్రవేశం చేశాడు. అతను చేసిన డ్యాన్స్, ఫైట్స్ ఆకర్షణీయంగా నిలిచాయి. ఇతర పాత్రల్లో శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, అజయ్ పూర్కర్, శరత్ లోహితాశ్వ, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్, ప్రభాకర్... ఇలా తెరపై ఎన్నో పాత్రలు కనిపిస్తాయి.

సినిమాను చాలా ఉన్నతంగా తీశారు. బోయపాటి సినిమాకు ఎటువంటి సంగీతం కావాలో అటువంటిదాన్నే తమన్ ఇచ్చాడు. ప్రొడక్షన్ డిజైన్, కూర్పు తదితర విభాగాలు మంచి పనితీరును కనపరిచాయి. సినిమాపై బోయపాటి మరోసారి తన మార్క్ తోపాటు పూర్తి పట్టును కూడా ప్రదర్శించాడు. ఎలివేషన్స్ తో కట్టిపడేశాడు. పాన్ ఇండియా సినిమా స్థాయికి తగ్గట్లే ఘనంగా ఉంది.












Click it and Unblock the Notifications