Romanchakam Movie Review: 'రోమాంచకం' మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?
Romanchakam Movie Review: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన సొంత నిర్మాణ సంస్థ భద్రికాళి పిక్చర్స్‌పై నిర్మించిన సినిమా 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటించిన ఈ సినిమా డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు ఈ సినిమా ప్రచారంలో పాల్గొనడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. యూత్ ను ఆకట్టుకున్న ప్రేమ, హస్యం, ఉత్కంఠ కలబోతగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
స్టోరీ
అన్వేష్(సుమంత్ ప్రభాస్) కాలేజీ పూర్తి చేసుకుని తన స్నేహితులతో కలిసి ఓ స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటాడు. అమ్మాయిలు, అబ్బాయిల అవసరాలు తీర్చేలా 'రోమాంచకం' అనే పేరుతో డేటింగ్ యాప్‌ను రూపొందిస్తాడు. ఆ యాప్ ద్వారానే చెన్నైకి చెందిన మైథిలి(అనంతిక)తో పరిచయం పెంచుకుని.. ప్రేమలో పడతాడు. మైథిలి పుట్టినరోజు తెలుసుకుని ఆమెకు సర్పైజ్ ఇచ్చేందుకు చెన్నై వెళ్లిన అన్వేష్ కు ఊహించని షాక్ తగులుతుంది. అక్కడి వస్తానని చెప్పిన మైథిలి.. అకస్మాత్తుగా ఫోన్, సోషల్ మీడియాలో అన్వేష్ ను బ్లాక్ చేసి మాయమవుతుంది. అసలు మైథిలి ఎందుకు బ్లాక్ చేసింది? ఆమె మాయం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? చివరికి వీరిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేదే మిగతా స్టోరీ.

విశ్లేషణ
ఈ చిత్ర డైరెక్టర్ ప్రేమకథ కంటే కూడా కథ మధ్యలో వచ్చే చిన్న ఉత్కంఠ, దాని చుట్టూ పండించిన కామెడీపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆరంభంలో హీరో స్టార్టప్ పాయింట్ తో స్టోరీ మొదలైనా.. ఆ తర్వాత దాన్ని ప్రస్తావన పెద్దగా ఉండదు. అలాగే హీరో, హీరోయిన్ పాత్రల ప్రవర్తనలో కొన్ని చోట్ల లాజిక్ లోపిస్తుంది. అయితే ఈ చిన్న చిన్న లోపాలను హీరో, అతని స్నేహితుల మధ్య సాగే సీన్లు పూర్తిగా మర్చిపోయేలా చేస్తాయి. జెన్ జీ కుర్రాళ్ల అల్లరి, వారిలోని అమాయకత్వం, ఫ్రస్ట్రేషన్, ఫ్రెండ్స్ కోసం నిలబడే తీరు కామెడీని పండిస్కాయి.
హీరో చెన్నై వెళ్లిన అనంతరం హీరోయిన్ బ్లాక్ చేయడంతో కథలో అసలు ఉత్కంఠ మొదలవుతుంది. సెకండాఫ్ లో పోలీసు అధికారిగా ఉపేంద్ర లిమాయే కామెడీ పెద్దగా వర్కవుట్ కానప్పటికీ.. హీరో గ్యాంగ్ సీన్లు నవ్వులు పూయిస్తాయి. సాంబార్-బిరియాని కాన్సెప్టుతో వచ్చే రీజనల్ సంభాషణలు, క్లైమాక్స్ లో హీరోయిన్ పెళ్లి చుట్టూ సాగే హంగామా ఆకట్టుకుంటాయి. కథలో పెద్దగా లాజిక్ వెతక్కుండా కాసేపు హాయిగా నవ్వుకోవాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సాంకేతికత
హీరో సుమంత్ ప్రభాస్ ఫ్రస్ట్రేషన్ చూపిస్తూనే మంచి కామెడీ టైమింగ్‌తో మెప్పించగా.. అనంతిక తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. హీరో ఫ్రెండ్స్‌గా నటించిన వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్ లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా నరేంద్ర రవి నటన నవ్వులు పూయిస్తుంది. సాంకేతిక విభాగంలో వాసుకి వైభవ్ మ్యూజిక్, పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. 'రాధా రమణ' పాట చిత్రీకరణ బాగుంది. దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి తొలి చిత్రమే అయినా మేకింగ్ పై మంచి పట్టు సాధించారు.
ఈ సినిమా ప్లస్ పాయింట్స్
ఈ సినిమా మేజ్ ప్లస్ పాయింట్ అంటే హాయిగా నవ్వించే హాస్యం అని చెప్పవచ్చు. కథలో ఉత్కంఠ కూడిన సీన్లు ఉన్నాయి. హీరో, హీరోయిన్ల జోడీ, ఫ్రెండ్స్ గ్యాంగ్ పెర్ఫార్మెన్స్ కూడా ప్లస్ పాయింట్లుగా నిలిచాయి.
మైనస్ పాయింట్స్
ఈ సినిమాలో ప్రారంభ సన్నివేశాలు కాస్త బోరు కొట్టిస్తాయి. కొద్దిగా లాజిక్ లేని కథనం కూడా మైనస్ పాయింట్ గా నిలిచింది.
ఫైనల్‌గా..
లాజిక్స్ పక్కన పెడితే 'రోమాంచకం' థియేటర్లలో నవ్వుల విందును అందిస్తుంది.
రేటింగ్: 2/5.













Click it and Unblock the Notifications