'పుష్ప2' రికార్డును బద్దలు కొట్టబోతున్న 'సంక్రాంతికి వస్తున్నాం'!
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. 14వ తేదీన థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సినిమా నాలుగు రోజులకే రూ.131 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కుటుంబ ప్రేక్షకులకు మొదటి ప్రాధాన్యత ఈ సినిమాకు వస్తుండటంతో కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ రెండురోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు బాలయ్య నటించిన డాకూ మహారాజ్ సినిమాకు నైజాంలో థియేటర్లు తక్కువ సంఖ్యలో కేటాయించడంపై బాలకృష్ణ అభిమానులు థియేటర్ల సంఖ్యను పెంచాలంటూ ఆందోళన చేస్తున్నారు.
మొదటివారంలో రూ.100 కోట్ల షేర్?
సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్లు ఇలాగే కొనసాగుతూ వెళితే పుష్ప2, ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా రూ.56 కోట్ల షేర్ సంపాదించింది. గత రెండు దశాబ్దాలుగా వెంకటేష్ సినిమా ఏదీ రూ.25 కోట్ల షేర్ కు మించలేదు. కానీ అనూహ్యంగా ఈ సినిమా నాలుగు రోజులకే రూ.56 కోట్ల షేర్ అందించి సంచలన రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల షేర్ వచ్చిందని, మొదటి వారంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.100 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కేవలం రూ.120 నుంచి రూ.130 కోట్ల షేర్ వసూలు చేస్తుందంటున్నారు.

సలార్, దేవర ను బద్ధలు కొట్టొచ్చు
ఇటీవలి కాలంలో ఏపీ, తెలంగాణలో సినిమా బాగుందంటే కనీసం 30 నుంచి 40 రోజుల వరకు థియేటర్లలో ఆడుతున్నాయి. సలార్, దేవర చిత్రాలు రూ.125 కోట్ల షేర్ వసూళ్లు సాధించాయి. ఈ సినిమాలను వెంకీ అధిగమించే అవకాశం కనపడుతోంది. దీనితర్వాత ఆర్ఆర్ఆర్, పుష్ప2 రికార్డులను కూడా వెంకీ లేపేయడం ఖాయమంటున్నారు. ప్రజలు కామెడీ సినిమాల కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారనేదానికి ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు నిదర్శనమని, ప్రేక్షకుడు ఎంటర్ టైన్ అవ్వడానికి థియేటర్ కు వచ్చేదే తన సమస్యల నుంచి బయటపడేందుకని, అలా కాకుండా ఏవేవో సినిమాలు తీస్తే తప్పనిసరై చూడటమేకానీ, ప్రేక్షకుడిని మనస్ఫూర్తిగానవ్వుకునేలా థియేటర్ నుంచి బయటకు పంపిస్తే సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయంటున్నారు.












Click it and Unblock the Notifications