అతనితో రిలేషన్ చాలా "డేంజర్" అంటున్న మిల్కీ బ్యూటీ..
మిల్కీ బ్యూటీ "తమన్నా" గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ భామ.. దాదాపు స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ సహా పలు భాషల్లో నటించి మెప్పించింది ఈ భామ. లవ్ స్టోరీస్, యాక్షన్ ఎంటర్టైనర్లు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. ఇలా అన్ని రకాల చిత్రాల్లో అదరగొట్టింది.
ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో మాత్రం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. గతేడాది 'ఓదెల 2' తో విజయం సాధించిన తమన్నా.. కమర్షియల్ చిత్రాలతో పాటు ఓటీటీలో విభిన్న పాత్రలు ఎంచుకుంటున్నారు. కోలీవుడ్‌లో విశాల్ నటిస్తున్న 'పురుషన్' ('మొగుడు' - తెలుగు డబ్బింగ్) లో, బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, సంజయ్ దత్ ల 'రేంజర్' లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్ గా తమన్నా మరోసారి తన వ్యక్తిగత జీవిత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

సినిమాలకంటే ఎక్కువగా తన ప్రేమ జీవితంపై జరిగే చర్చల కారణంగా తరచూ హాట్ టాపిక్ అవుతున్న తమన్నా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక రిలేషన్‌షిప్‌ను ఆమె "డేంజర్" అంటూ అభివర్ణించడంతో.. ఆ వ్యాఖ్యలు గతంలో నటుడు విజయ్ వర్మతో ఉన్న బంధానికేనా? అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో రెండు సార్లు హార్ట్ బ్రేక్ ఎదురైనట్లు చెప్పిన ఆమె, మొదటి ప్రేమ టీనేజ్ దశలోనే మొదలైందని తెలిపారు. అయితే సినీ కెరీర్‌పై దృష్టి పెట్టాలనే లక్ష్యంతో ఆ ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అప్పుడు కెరీర్ ముఖ్యమని అనిపించిందని.. ఆ నిర్ణయం బాధ కలిగించినా, అవసరమైనదే అని ఆమె పేర్కొన్నారు. అలానే రెండో రిలేషన్‌షిప్ గురించి చెబుతూ.. ఆ బంధం తన వ్యక్తిత్వానికి, భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతోందని గ్రహించి బయటపడినట్లు తమన్నా తెలిపారు.
కొన్ని సంబంధాలు మనల్ని మనమే కోల్పోయేలా చేస్తాయి. అలా నా వ్యక్తిత్వానికి, నా భవిష్యత్తుకు డేంజర్ అనిపించినప్పుడు బయటకు రావడమే సరైన నిర్ణయం" అని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఈ 'డేంజర్ రిలేషన్' వ్యాఖ్యలు విజయ్ వర్మను ఉద్దేశించివేనా? అన్న ప్రశ్న సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 'లస్ట్ స్టోరీస్ 2'లో కలిసి నటించిన తర్వాత తమన్నా - విజయ్ వర్మ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని అప్పట్లో బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది.
మరీ ముఖ్యంగా ఇద్దరూ కలిసి ఈవెంట్లకు హాజరవడం, హాలిడేస్‌కు వెళ్లడం వంటి ఫోటోలు వైరల్ కావడంతో పెళ్లి వరకు వెళ్లొచ్చని కూడా అభిమానులు భావించారు. అయితే కొద్ది కాలానికే వారి మధ్య దూరం ఏర్పడిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తమన్నా చేసిన వ్యాఖ్యలు పాత రూమర్లకు మళ్లీ ఊపిరి పోస్తున్నాయి. ఇక ప్రేమ కంటే ఆత్మగౌరవం, స్వీయ గుర్తింపు, కెరీర్ ముఖ్యం అనే సందేశాన్ని ఆమె తన మాటల ద్వారా ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications