రాజకీయ నాయకుల ఒత్తిడి... ఆ హీరో ఆడియో ఫంక్షన్ రద్దు
తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కు రెడ్ గెయింట్ అనే నిర్మాణ సంస్థ ఉంది. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదలవుతున్న ప్రతి సినిమాలోను తమకు ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన హక్కులు ఇవ్వమని వేధింపులకు గురిచేస్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే విజయ్ నటిస్తున్న లియో చిత్రం మీద కూడా రెడ్ గెయింట్ కన్ను పడినట్లు కోలీవుడ్ మీడియా తెలిపింది.
కాదు.. అంటున్న నిర్మాణ సంస్థ
లియో సినిమాకు సంబంధించి కొన్ని ప్రాంతాలకు హక్కులు కావాలని అడిగారంట. అయితే బేరసారాలు కుదరకపోవడంతో నిర్మాత సారీ చెప్పారంట. దీంతో కావాలనే లియో ఆడియో ఫంక్షన్ కు అనుమతివ్వలేదంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై లియో నిర్మాణ సంస్థ స్పష్టత ఇచ్చింది. అభిమానులు భారీగా తరలివస్తారనే అంచనా ఉండటంతోపాటు పాస్ లు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుందని, భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని ఆడియో ఫంక్షన్ రద్దుచేసినట్లు తెలిపింది. అయితే విజయ్ అభిమానుల కోరిక మేరకు ఎప్పటికప్పుడు అప్ డేట్లు ఇస్తామని, అంతేకానీ తమపై ఏ రాజకీయ పార్టీ ఒత్తిడి లేదని తెలిపింది.

రెండేళ్లల్లో 33 సినిమాలు
అయితే విజయ్ అభిమానులు మాత్రం దీనిపై భగ్గుమంటున్నారు. కావాలనే ఒత్తిడిచేసి ఫంక్షన్ రద్దు చేయించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. రెడ్ గెయింట్ మీద, ఉదయనిధి స్టాలిన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. 2011 నుంచి 2022 వరకు ఆ సంస్థ 22 సినిమాలను కొనుగోలు చేసిందని, 2021 నుంచి 2023 వరకు 33 సినిమాలను కొందని, డీఎంకే అధికారంలో ఉండబట్టే ఇలా చేసిందంటూ లిస్టును షేర్ చేస్తున్నారు. వీటిపై రెడ్ గెయిన్ సంస్థ కానీ, ఉధయనిధి స్టాలిన్ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పటికే ఉదయనిధి చుట్టూ వివాదాలు అల్లుకున్నాయి. సనాతన ధర్మం ఓ రోగం లాంటిదని, దాన్ని నిర్మూలించాలంటూ చేసిన కామెంట్లతో దేశవ్యాప్తంగా అతనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications