ఈ సినిమా టైటిల్ చూస్తే ఇంకేదో గుర్తొస్తుందిగా.. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" !!
ప్రస్తుతం ఇండియన్ సినిమా రేంజ్ మారిపోయింది. రీజనల్ స్థాయి నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ లో మన సినిమాలు అదరగొడుతున్నాయి. దీంతో ఇతర భాషల అభిమానులు సైతం తెలుగు చిత్రలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి నెలా, ప్రతి వారం థియేటర్లలోకి ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తూనే ఉంటాయి. అయితే తమ సినిమా విషయంలో ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఒక్కో మూవీ టీం ఒక్కోలా ప్లానింగ్ చేస్తుండడం సహజమే.
ఈ క్రమంలోనే చిత్రం టైటిల్ కూడా ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే సినిమా పేర్ల విషయంలో చిత్ర బృందం పక్కా ప్లానింగ్ తో ఉంటుంది. ఇప్పుడు లేటస్ట్ గా తెలుగులో కొత్తగా అనౌన్స్ చేసిన ఒక మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "మ్యాజిక్ మూవ్ మెంట్స్". మీరు అనుకున్నది కాదు అనేది క్యాప్షన్ గా పెట్టారు. ఈ పేరు వినగానే క్యాప్షన్ లో చెప్పినట్టు ఖచ్చితంగా ఇంకేదో గుర్తు రావడం సహజమే. మరి ముఖ్యంగా మద్యపాన ప్రియులు అయితే వెంటనే గుర్తుపట్టేస్తారు. దాంతో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్ పై తల్లాడ శ్రీనివాస్ మూవీని నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ - సాయిబాబా ఆశీస్సులు ఇస్తున్న ఫొటో ఒకటి మా ఇంట్లో ఫ్రిడ్జ్ మీద ఉంది. ఆ ఫొటో చూసిన ఇన్సిపిరేషన్ తో "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా స్క్రిప్ట్ మొదలైందని చెప్పుకొచ్చారు. నేను గతంలో మిస్టరీ అనే మూవీ చేశాను. ఆ తర్వాత సోషల్ మీడియా ప్రమోషన్స్ చేశాను. ఆ టైమ్ లోనే దశరథ్ తో కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చిందని వివరించారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు డివోషనల్ టచ్ కూడా ఈ మూవీలో ఉంటుందని స్పష్టం చేశారు. సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చిందని.. త్వరలోనే మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు.
అలానే ప్రముఖ డైరెక్టర్ దశరథ్ మాట్లాడుతూ.. తల్లాడ సాయికృష్ణతో తనకు మంచి పరిచయం ఉందని అన్నారు. ఇది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని.. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, జబర్దస్త్ జీవన్, జబర్దస్త్ అప్పారావు, గడ్డం నవీన్, పలువురు నటిస్తున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications