విడుదలకు ముందే రూ.100 కోట్లు సాధించిన ఏకైక సినిమా
పాతికేళ్ల క్రితం, పదిహేనేళ్ల క్రితం కూడా ఒక సినిమా రూ.100 కోట్లు సాధించగులుగుతుందా? అనే సందేహం సినీ పరిశ్రమలతోపాటు సినీ ప్రియుల్లో కూడా ఉండేది. ఎప్పుడో 1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్ సినిమాకు రష్యాలో 94 కోట్ల రూపాయలు రాగా, ఇండియాలో వచ్చిన రూ.6 కోట్లు కలుపుకొని మొదటి రూ.100 కోట్ల సినిమాగా నిలిచింది. క్రమేణా సినీ పరిశ్రమలో, ప్రేక్షకుల అభిరుచుల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చిత్రాల బడ్జెట్, నటీనటుల పారితోషికం పెరగడంతోపాటు థియేటర్ల టికెట్ ధరలు పెరిగాయి. తర్వాత ఓటీటీలు రావడం, టీవీల శాటిలైట్ ధరలు ఉండటంతో నిర్మాతలు ధైర్యంగా ఖర్చుపెట్టడానికి ముందుకు వచ్చారు.
ఆ తర్వాత రాజమౌళి లాంటి దర్శకులు ప్రభుత్వాలతో మాట్లాడి టికెట్ ధరల పెంపునకు ప్రత్యేక అనుమతులు తెచ్చుకునేవారు. దీంతో సినిమా విడుదలైన వారానికి, రెండువారాలకు రూ.100 కోట్లు రావడం అనేది చాలా సర్వసాధారణమైపోయింది. క్రమేపీ సినిమాకు రూ.100 కోట్లు అనేది సహజమైంది. అయితే సినిమాలన్నీ విడుదలకు ముందు భారీగా వ్యాపారం చేస్తాయి. భారీ ధరలకు నిర్మాతలు అమ్ముకుంటారు. సినిమా విడుదలైన తర్వాత డబ్బులు వస్తాయి. అదంతా ఒక ఎత్తయితే సినిమా విడుదలకు ముందే రూ.100 కోట్లు సాధించడం అంటే సాధారణమైన విషయం కాదు. అటువంటి అసాధారణమైన రికార్డును మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సొంతం చేసుకున్నారు.

మోహన్ లాల్ కథానాయకుడిగా ఒక చరిత్రాత్మక కథతో సినిమా రూపుదిద్దుకుంది. దీనిపేరు 'మరక్కార్: లయన్ ఆఫ్ ది ఆరేబియన్ సీ'. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ.100 కోట్లు వచ్చాయి. 2020 మార్చిలో విడుదలవ్వాల్సిన ఈ సినిమాను కరోనా వల్ల 2021 డిసెంబరులో విడుదలైంది. సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో అన్నిచోట్ల ముందస్తు అడ్వాన్స్ గా టికెట్ల అమ్మకాలతోనే రూ.100 కోట్లు వచ్చేశాయి. సినిమా విడుదలైన తర్వాత వాణిజ్యపరంగా మెప్పించలేకపోయింది కానీ జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, కాస్ట్యూమ్ డిజైనర్, స్పెషల్ ఎఫెక్ట్ కేటగిరిల్లోను, అలాగే కేరళ రాష్ట్ర అవార్డులను సైతం దక్కించుకుంది.












Click it and Unblock the Notifications