ఆ సినిమా చేస్తే అట్టర్ ఫ్లాప్ అన్నారు... ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా మెగా స్టార్ గా రాణిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి చరిత్రలో తనకంటూ ప్రత్యేకంగా ఓ పేజీని లిఖించుకున్నారు. ప్రముఖ దర్శక దిగ్గజుడు దాసరి నారాయణరావు ఓ సందర్భంలో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ గురించి మాట్లాడాలంటే చిరంజీవికి ముందు, చిరంజీవి తర్వాత అని మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నారు. అంతగా తెలుగు తెరపై తన ముద్ర వేశారు. తాజాగా ఇటీవలే గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. అత్యధిక సినిమాల్లో, అత్యధిక పాటలకు నృత్యం చేసిన హీరోగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
బాలయ్యతో ఇప్పటికే రెండు చేశా
చిరంజీవితో బి.గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అశ్వనీదత్ భావించారు. చిన్నికృష్ణ దగ్గర కథ ఉండటంతో దాన్ని వినమని అశ్వనీదత్ గోపాల్ కు చెప్పారు. ఆయన విని సినిమా చేయను.. చేస్తే ఇది కచ్చితంగా ఫ్లాప్ అవుతుందన్నారు. దీనిపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ బి.గోపాల్ ను కలిసి ఎందుకు ఈ సినిమా చేయనన్నావు అని అడిగారు. అది ఫ్యాక్షన్ సినిమా అని, ఇప్పటికే తాను బాలకృష్ణతో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు చేశానని, మళ్లీ ఇప్పుడు చిరంజీవితో చేస్తే ఫ్లాప్ అవుతుందని, తాను ఇప్పటికే మెకానిక్ అల్లుడు రూపంలో చిరంజీవికి ఫ్లాప్ ఇచ్చానని, మరో ఫ్లాప్ ఇవ్వలేను అన్నారు.

చిరుతో చేయి చాలా ఫ్రెష్ గా ఉంటుంది
నువ్వు ఫ్యాక్షన్ సినిమాలు చేసింది బాలయ్యతో.. చిరంజీవితోకాదుకదా.. ఈ కథ చిరంజీవితో చేస్తే చాలా ఫ్రెష్ గా ఉంటుంది.. చేసి చూడు కచ్చితంగా ప్రజలు ఫ్రెష్ గా ఫీలవుతారు.. హిట్ అవుతుందని గోపాలకృష్ణ గోపాల్ ను ఒప్పించారు. దీంతో గోపాల్ ఈ కథకు ఇంద్ర అని పేరు పెట్టి సినిమా చేస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అప్పట్లోనే రూ.35 కోట్లు వసూలు చేసింది. వద్దన్న సినిమానే బలవంతంగా గోపాల్ చేత తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఘనత చిరంజీవితోపాటు అశ్వనీదత్ కు, పరుచూరి సోదరులకు దక్కుతుంది. అలాగే చిన్నికృష్ణతోపాటు మణిశర్మ కూడా మంచి సంగీతాన్ని అందించారు. ఇవన్నీ కలిపి సినిమాను ఆల్ టైం హిట్ గా నిలిపాయి.












Click it and Unblock the Notifications