Tollywood: డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన నిర్మాత
Tollywood: ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో కొత్త నిర్మాతల తాకిడి పెరిగింది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు సినిమాపై ఉన్న మక్కువతో ఇక్కడికి వచ్చిన చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ ఎన్నారై నిర్మాత క్రీడా నేపథ్యం ఉన్న కథతో ఒక చిన్న చిత్రాన్ని నిర్మించారు. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందింది. సినిమా సక్సెస్ కావడంతో అంతా సవ్యంగానే ఉందని అందరూ భావించారు.
పబ్లిసిటీ ఖర్చుల ఎగవేత
సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా.. అది ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే పబ్లిసిటీ అత్యంత కీలకం. ఈ సినిమా విడుదల సమయంలో నిర్మాత పబ్లిసిటీ టీంను సంప్రదించి భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. పోస్టర్లు, సోషల్ మీడియా ప్రమోషన్లు, ఇంటర్వ్యూల కోసం సదరు పబ్లిసిటీ టీమ్ పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసింది. అయితే సినిమా రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకున్నాక దానికి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సిన సమయంలో సదరు నిర్మాత తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ఖర్చులు చెల్లించకుండానే ఆయన గుట్టుచప్పుడు కాకుండా అమెరికాకు పరారయ్యారనే వార్త ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

పబ్లిసిటీ టీం ఆందోళన
నిర్మాతను నమ్మి తమ సొంత డబ్బులకు కూడా వెచ్చించి ప్రమోషన్లు చేసిన పబ్లిసిటీ టీం ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. ఆయన అమెరికా వెళ్లిపోవడమే కాకుండా అక్కడి నుంచి ఫోన్ కాల్స్‌కు కూడా సరిగా స్పందించకపోవడంతో తమ డబ్బులు తిరిగి వస్తాయా లేదా అన్న ఆందోళన వారిలో మొదలైంది. సాధారణంగా పెద్ద నిర్మాతలు ఇలాంటి ఆర్థిక లావాదేవీల సమయంలో చాలా పద్ధతిగా వ్యవహరిస్తారని.. కానీ ఇలాంటి కొంతమంది కొత్త నిర్మాతలు మధ్యలో హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇండస్ట్రీలో కింది స్థాయిలో పనిచేసే వారికి తీవ్రనష్టం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు.
చర్చనీయాంశంగా మారిన ఎన్నారై నిర్మాత
చిన్న సినిమా తీసి భారీ విజయాన్ని సాధించిన సంతోషం కంటే ఈ నిర్మాత చేసిన మోసంపైనే ఇప్పుడు సినీ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎన్నారై నిర్మాతలు కేవలం గ్లామర్ కోసమే వచ్చి ఇలాంటి పనులు చేస్తే.. భవిష్యత్తులో కొత్తవారిని నమ్మడం కష్టమవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాధితులు ఇప్పుడు ఈ విషయాన్ని మూవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications