విజయ్ - రష్మిక పెళ్లి కార్డు లీక్.. బాంబు పేల్చిన రౌడీ టీమ్!
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నారు. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ వస్తున్న వార్తలకు ఇప్పుడు గట్టి ఆధారాలు లభిస్తున్నాయి. 'గీత గోవిందం' సినిమాతో మొదలైన వీరి పరిచయం 'డియర్ కామ్రేడ్' నాటికి గాఢమైన ప్రేమగా మారింది. ఇప్పటివరకు తమ బంధంపై అధికారికంగా స్పందించని ఈ జంట, వెకేషన్ ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా వీరి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో లీక్ అవ్వడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
ఉదయపూర్ వేదికగా వివాహం
గతేడాది రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. ఈ నెల ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా వివాహం చేసుకోబోతున్నారు. చారిత్రాత్మకమైన ఓ కోటలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జైపూర్‌లో పెళ్లి పనులను ఈ జంట దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే, వీరి పెళ్లి కార్డు నెట్టింట వైరల్ అవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

విజయ్ టీమ్ అసహనం.. ఆ క్లారిటీ వచ్చేసింది!
పెళ్లి కార్డు లీక్ అవ్వడంపై విజయ్ దేవరకొండ టీమ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేవలం కార్డు వైరల్ అవ్వడమే కాకుండా.. అందులో అతిథుల వివరాలు, ఫోన్ నెంబర్లు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. ప్రముఖుల ఫోన్ నెంబర్లు, వివరాలు ఉన్న కార్డులను పోస్ట్ చేయడం వల్ల వారికి ఇబ్బందులు కలుగుతాయి. రాజకీయ, సినీ రంగాలకు చెందిన అతిథుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి విషయాల్లో సంయమనం పాటించాలి. ఆ మాత్రం తెలియదా?" అంటూ టీమ్ సభ్యులు హితవు పలికారు. అయితే పెళ్లి కార్డు గురించి టీమ్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఫిబ్రవరి 26న పెళ్లి జరగడం ఖాయమని నెటిజన్లకు ఒక క్లారిటీ వచ్చేసింది.
ముస్తాబైన విజయ్ దేవరకొండ ఇల్లు
వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల మధ్య, విజయ్ దేవరకొండ ఇల్లు ఇప్పుడు పెళ్లికళతో కళకళలాడుతోంది.హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న విజయ్ దేవరకొండ విలాసవంతమైన నివాసం ప్రస్తుతం విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్
పెళ్లి వేడుక రాజస్థాన్‌లో ముగిసిన తర్వాత, మార్చి 4వ తేదీన హైదరాబాద్ వేదికగా ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖ దర్శకులు, హీరోలు, హీరోయిన్లు హాజరుకానున్నారు. మొత్తానికి ఇన్నాళ్ల సస్పెన్స్‌కు తెరపడటంతో అభిమానులు ఈ 'విరోష్' జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications