వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: యాదిరెడ్డిది చివరి ఆత్మహత్య కాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Yadireddy
తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వెయ్యినొక్కటో అమరుడికి భారత ప్రభుత్వం, సీమాంధ్ర ప్రభుత్వం కలిసి ఎప్పటివలెనే దొంగతనంగా అంత్యక్రియలు నిర్వహించాయి. బంధుమిత్రుల మధ్య కాకుండా మఫ్టీ పోలీసుల కనుసన్నల్లో యాదిరెడ్డిని బొంద పెట్టారు. దీనికి యాదిరెడ్డి ఆత్మ క్షోభిస్తుంది. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయనందు వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పన్నెండు పేజీల సూసైడ్ నోట్ రాసి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానకి చెందిన యాదిరెడ్డి జులై 20న పార్లమెంటు సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. యాదిరెడ్డి మృతదేహాన్ని అనాథ శవంగా, గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీలోని ఏదో ఒక మారుమూల స్మశానంలో ఖననం చేద్దామని అనుకున్నారు. తెలంగాణకు చెందన అన్ని పార్టీల నాయకులు ఢిల్లీకి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆయన స్వగ్రామానికి తరలించారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్‌లోకి తేనివ్వకుండా విమానం ద్వారా శంషాబాద్ తరలించారు. మృతదేహాన్ని ఎపి భవన్‌లో వుంచి అక్కడ నివాళులు అర్పించి తర్వాత హైదరాబాదు తరలించాలని తెలంగాణవాదులు అనుకున్నారు. కానీ ప్రభుత్వం, రాజ్య యంత్రాంగం దాన్ని కుదురలేదు. ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ వచ్చిన యాదిరెడ్డి శవపేటిక ఆగమనాన్ని కవర్ చేద్దామని వెళ్లిన మీడియావారిని పోలీసులు పాశవికంగా కొట్టి అరెస్టు చేసి అడ్డుకున్నారు. కవరేజికి అనుమతి లేదని దాదాపు 50 మంది విలేకరులను అరెస్టు చేసి పోలీసు స్టేషనుకు తరలించారు. విమానాశ్రయం నుంచి మృతదేహాన్ని గన్‌పార్కు వద్దకు తెచ్చి నివాళులర్పిద్దామని ఉద్యమకారుల ఆచారాన్ని కూడా పోలీసులు నిర్దయగా అడ్డుకున్నారు.

పూర్తి అస్తిత్వాల భావజాలంలో ఉన్న తెలంగాణవాదులు - 'తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అన్ని దారులు మూసుకుపోయాని. ఇక తెలంగాణ రాదని నిరాశ చెంది చివరాఖరికి ఆత్మహత్య చేసుకుంటున్నార'న్నది సామాజిక శాస్త్రవేత్తలు నిర్దారిస్తున్న విషయం. ఈ ఆత్మహత్యలు ఆగాలంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న స్పష్టమైన సంకేతాలు పంపి ఉద్యమకారుల్లో ఆశావహ దృక్పథాన్ని కలిగించాలి కానీ తద్విరుద్ధమైన పనులనే రెండు ప్రభుత్వాలూ చేస్తున్నాయి. తెలంగాణవాదుల పట్ల దురాక్రమణ చేసిన శత్రు దేశ పాలకుల వలె అటు భారత్, ఇటు సీమాంధ్ర ప్రవర్తిస్తున్నాయి. తెలంగాణ కోసం మరణించినవారికి బంధుమిత్రులు ఆచారం ప్రకారం అంత్యక్రియలు చేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకపోవడం పౌరుల కనీస హక్కులను హరించడమే. బతకనివ్వకపోవడం, అటుంచి చచ్చిన తరువాత కూడా కనీస గౌరవంతో సాగనంపుకునే అవకాశం లేకుండా చేసే ధోరణి దురాక్రమణదారులకే ఉంటుంది.

శంషాబాద్‌లో దిగిన యాదిరెడ్డి మృతదేహ పేఠికను ఎవర్నీ చూడనివ్వకుండా దొంగదారుల్లో దారులు మార్చి మార్చి ఆయన స్వగ్రామానికి చేర్చారు. అణరుడు యాదిరెడ్డిని కడసారి చూసి నివాళులు అర్పిద్దామనుకున్న చుట్టుపక్కల గ్రామాలవారిని పోలీసులు అడ్డుకుని బెదిరించారు. పెద్ద మంగళారం, చుట్టుపక్కల గ్రామాల్లో రాత్రి విద్యుత్ సరఫరాను కట్ చేశారు. మొత్తం తెలంగాణలో వీలైన వీలైన చోటల్లా టెలివిజన్ ప్రసారాలను నిలిపివేశారు. ఆ ఊరు వెళ్లే అన్ని దారులను హైదరాబాదు నుంచి తరలించిన బ్యారికేడ్లతో దిగ్బంధం చేశారు. అలా ఒక తెలంగాణ పౌరుడి అంతిమ వీడ్కోలు యాత్ర పద్ధతి ప్రకారం చేయనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకున్నది. ఇది దురాక్రమణదారుల ధోరణి, ఇది సామ్రాజ్యవాదుల ధోరణి. ఇది రాజ్య నిర్వాహకుల ధోరణి. యాదిరెడ్డిని మఫ్టీ పోలీసుల కనుసన్నల్లో ఆగం ఆగంగా అంతిమ నివాళికి ఆస్కారం ఇవ్వకుండా బొంద పెట్టడమే దీనికి తార్కాణం.

ఫిబ్రవరి 20, 2011న సిరిపురం యాదగిరి అనే యువకుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం గేటు ముందు పోలీసుల కళ్ల ముందు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా పోలీసులు అచ్చం ఇలాగే ప్రవర్తించారు. 1969లో కొన్నిసార్లు ఇలాగే ప్రవర్తించారు. ఎప్పటివలెనే సీమాంధ్ర మీడియా యాదిరెడ్డి అంత్యక్రియల వార్తను తొక్కిపెట్టింది. మొక్కుబడిగా ఆ వార్తను ప్రసారం చేసింది. ఇది చాలదన్నట్లు మధ్యమధ్యలో సమైక్యవాద ప్రకటనలను ప్రసారం చేసింది. ఎందుకనో ఉత్తరాది మీడియా కూడా తెలంగాణవారి ఆత్మహత్యలను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ వార్తలను నిర్లక్ష్యం చేస్తున్నది.

ప్రజాస్వామ్య పాఠాలు వల్లె వేస్తూ 2011లో కూడా పోలీసులు కెమెరా కళ్లను కప్పుతూ బరితెగించి ప్రవర్తించడం సిగ్గుచేటైన విషయం దురాక్రమణకు గురైన ప్రాంతంలోనే ప్రజల కనీస హక్కులు హరింపబడతాయి. గౌరవంగా అంత్యక్రియలు చేసుకునే హక్కును పౌరులు కోల్పోతారు. సరిగ్గా ఈ పరిస్థితే తెలంగాణవారికి దాపురించింది. ఇలా 1949 నుండి తెలంగాణ దురాక్రమణకు గురైన ప్రాంతంగా మారిపోయింది. తెలంగాణ నేతలను పార్టీల అధిష్టానాలు గంజిలో ఈగల్లా తీసిపారేస్తున్నారు. రాలిపోయిన వెంట్రుకతో సమానంగా చూస్తున్నారు. తెలంగాణ శాసనసభ్యుల నూటొక్క రాజీనామాలను ఎవరూ లెక్కలోకి తీసుకోలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉంది. యాదిరెడ్డి శవం లేవనే లేదు. మరో అరడజను ఆత్మహత్యాయత్నాలు జరిగాయి. ఇద్దరో ముగ్గురో మరణించారు వరంగల్ జిల్లా జఫర్‌గడ్ దగ్గర సూరారంలో ఆత్మహత్యా యత్నం చేసుకున్న యువకుడు - నా తెలంగాణ నాకు కావాలి సార్, ఇప్పుడు కాపాడారు కాని తెలంగాణ ఇవ్వకపోతే మళ్లీ ఆత్మహత్య చేసుకుంటా, ఇప్పుడు మీరు నన్ను ఆపలేరు అని నిలువెల్లా కాలిన గాయాలతో మరణశయ్య మీంచి మాట్లాడాడు. ఈ తీరు గుండెలను కలచివేస్తుంది. గతంలో శ్రీకాంతాచారి కూడా దాదాపు ఇవే మాటలను చెబుతూ తుది శ్వాస విడిచాడు నల్లగొండ జిల్లా తుర్కపల్లి దగ్గరి మల్కాపురంలో తోడేటి కైలాసం ఆత్మహత్య చేసుకున్నాడు. మరో డిగ్రీ విద్యార్థి ఆలం శివ ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడు. కొందరి ఆత్మత్యాగాలు వెలుగు చూడడమే లేదు. ఒక్కరా.. ఇద్దరా.. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు.

చావాల్సింది మీరు కాదు, చంపాల్సింది మమ్మల్ని కదా అని ఒక తెలంగాణ కాంగ్రెసు నాయకుడు అన్న మాటలను ఈ సందర్భంగా ఎలా అర్థం చేసుకోవాలో. మాటలు కాదు చేతలు కావాలిప్పుడు తెగబడి కేంద్రంతో కొట్లాడాలి. నాయకులే ముందుండి సిన్సియర్‌గా ఉద్యమించాలి. ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించాలి. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. బయటికి ఇదే చివరి ఆత్మహత్య కావాలంటూ లోలోన ఉద్యమ గమనానికి ఆత్మహత్యలు ఉచిత ఇంధనంగా సమకూరుతున్నాయని లోలోన సంబురపడే సిన్సియారిటీ లేని ఉద్యమకారులు ఎప్పుడో ఒకసారి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటికి వెళ్తే తల్లి ప్రేమ తన నిర్ణయం మారుస్తుందని భయపడి ఆమెను చూడకుండనే ఢిల్లీ రైలు ఎక్కినట్లు యాదిరెడ్డి రాసిన సూసైడ్ నోట్‌లో ఉన్న ప్రతి అక్షరం పచ్చి నిజం. దాన్ని ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు సదా స్మరణ చేసుకోవాల్సిందే. పరిస్థితి ఇలా కొనసాగితే మరిన్ని ప్రాణాలు ఎగిరిపోతాయి ఉద్యమం హింసాత్మకమైతే పోలీసుల అత్యాధునిక ఆయుధాల వల్ల వేలాది మంది మనుషులు పిట్టల్లా రాలిపోతారు. ఉద్యమం పక్కదారి పట్టి హింస, ప్రతిహింసల మధ్య ఊహించని అనర్థాలెన్నో జరగవచ్చు. ఇందులో ఏ పరిస్థితి ఏర్పడినా దానికి బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. దాన్ని నడుపుతున్న సీమాంధ్రులదే. వారి అడుగులకు మడుగులొత్తుతున్న జైపాల్ రెడ్డి, హనుమంతరావు, నాగేందర్, ముఖేష్ గౌడ్, మర్రి శశిధర్ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డిలాంటి వారికి ఈ బాధ్యతలో పెద్ద పాలే ఉంటుంది.

- దుర్గం రవీందర్

English summary
Writer, senior journalist Durgan Ravinder says in his article that if a statement for Telangana sttaehood will not be announced, suicides in Telangana will continue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X