వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ మట్టిలోని ‘మాణిక్యం’ వెల్దుర్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Veldirthi Manikya Rao
తెలంగాణ ఆర్తి, ఆత్మీయత, ఆప్యాయతలు మేళవించి సాహిత్య, సామాజికోద్యమాల్ని నిర్మించి నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి వెల్దుర్తి మాణిక్యరావు. తెలంగాణలోని అన్ని జిల్లాలతో ప్రత్యక్ష పరిచయముండి వివిధ కార్యక్రమాల్ని విస్తృతంగా నిర్వహించిన ప్రతిభావంతుడు. కవిగా, కథకుడిగా, రచయితగా, చరిత్రకారుడిగా, గ్రంథమాల నిర్వాహకుడిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, ఆంధ్రమహాసభ కార్యదర్శిగా, పౌరహక్కుల నేతగా, గోలకొండ పత్రికలో జర్నలిస్టుగా, పలు పత్రికల సంపాదకుడిగా, అభ్యుదయ రచయితల సంఘం సభ్యుడిగా, ప్రభుత్వోద్యోగిగా విభిన్న పాత్రలు పోషించి సమర్ధుడనిపించు కున్నాడు. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు. సురవరం, మాడపాటి, కాళోజి, వట్టికోట మొదలైన మహామహులతో సన్నిహిత సంబంధాలుండేవి. వారు నిర్వహించిన ఉద్యమాలకు బాసటగా నిలిచిన ఉద్యమశీలి వెల్దుర్తి.

తెలంగాణ భాషలో నాటకాన్ని రాసి దానికి ప్రాచుర్యం కల్పించిన ప్రయోక్త. తెలుగు, ఉర్దు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ భాషల్లో రచనలు చేయగలిగినంత ప్రతిభ కలిగిన వెల్దుర్తి శతజయంతి సంవత్సరమిది. 12 డిసెంబర్‌, 1912లో వెల్దుర్తి జన్మదినం. తెలంగాణలో తెలుగువారి సాహిత్య సృజనకు ప్రోత్సాహమిచ్చేందుకు, వివిధ అభ్యుదయాంశాలపై చర్చలు జరిపేందుకు గాను మిత్రులు కాళోజి నారాయణరావు, గోలకొండ పత్రికలో జర్నలిస్టుగా ఉన్న మంథనికి చెందిన వేంకట రాజన్న అవధానిలతో కలిసి 1935లో హైదరాబాద్‌లో ‘వైతాళిక సమితి'ని ఏర్పాటు చేశారు. అభ్యుదయ భావాలు వ్యాప్తి చేసేందుకు తెలంగాణలో ఏర్పడ్డ మొట్టమొదటి సారస్వత సమితి ఇదే. ఈ సమితి సభ్యులుగా వీరు ముగ్గురు కలిసి కథలు రాశారు. ఇవి గోలకొండ పత్రికలో అచ్చయ్యాయి. జంట కవుల్ని చూశాము కానీ వీరు ‘కథక త్రయం'గా వెలిగారు. వీరు రాసిన ‘భూతదయ' కథ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ తర్వాతి కాలంలో వెల్దుర్తి కతలు అనేకం గోలకొండ పత్రికలో అచ్చయ్యాయి. హిందూముస్లింల సాన్నిహిత్యాన్ని తన కథల్లో చక్కగా మలిచారు.

భారం, ఏయిర్‌మెయిల్‌ కథలు వివిధ కథా సంకలనాల్లో చోటు చేసుకోగా, ఇప్పటికీ పత్రికల పుటల్లో ఎవ్వరికీ అందుబాటులో లేని కథలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా 193436 మధ్య కాలంలో గోలకొండ పత్రికలో వచ్చిన కథలు చాలా మందికి తెలియవు. అశోకుడు, కళోపాసన, నాదేశపు బట్ట, నిష్కామకర్మ, పిల్లలుసొమ్ములు, చిన్న కల ఇలా ఎన్నో కథలు ఆయన కలం నుంచి జాలువారాయి. తెలంగాణ భాషలో మొట్టమొదటి సారిగా పుస్తకం రాసిన ఘనత కూడా వెల్దుర్తికే దక్కుతుంది. ‘దయ్యాల పన్గడ' పేరిట వెలువడ్డ నాటకంలో అచ్చమైన పచ్చి పల్లెటూరి భాషను ఉపయోగించానని ఆయన చెప్పుకున్నారు. ఆరు అంకాలు, 80పేజీలు గల ఈ పుస్తకం రష్యన్‌ రచయిత టాల్‌స్టాయ్‌ పుస్తకం ‘ద ఫస్ట్‌ డిస్టిలర్‌'కు అనుసరణగా రాసిన ఈ నాటకంలో మద్యపాన నిరోధం ఆవశ్యకత గురించి తెలిపారు. తాగుడుకు మనిషి బానిసకావడం వల్ల జీవితం ఎలా పతనమవుతుందో ఇందులో చెప్పాడు. తాను మధ్యపాన నిరోధక సంఘ ఉద్యోగిగా ఉంటూ ఆ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఈ నాటకం రాసిండు. ఇది దేవరాజు మహారాజు పూనిక వల్ల ‘మా తెలంగాణ' పత్రికలో సీరియల్‌గా పునర్ముద్రించబడిరది. కథకుడిగానే గాకుండా జీవిత చరిత్రల రచయితగా కూడా వెల్దుర్తి చేసిన సేవ తక్కువదేమీ కాదు.

దయానందుల చరిత్ర, మాడపాటి హనుమంతరావుగారి జీవితం, ఎం.ఎన్‌.రాయ్‌, నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, వీర సావర్కర్‌ జీవితం, నిరంతర కృషి పేరిట సంస్కర్త, 1969 ఉద్యమ నాయకుడు బొజ్జం నర్సింలు జీవిత గాథల్ని అక్షరీకరించాడు. సుభాష్‌ చంద్రబోస్‌ పుస్తకం నిషేధానికి గురయింది. ప్రచురణ కర్తల్లో ఒకరైన కె.సి.గుప్త ఖైదు కావడానికి ఈ పుస్తకమే కారణం. జీవిత చరిత్రలతో పాటుగా వెల్దుర్తి కవిత్వం కూడా రాశాడు. ‘మాణిక్య వీణ' పేరిట కవితా సంకలనాన్ని వెలువరించాడు. అలాగే హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమ చరిత్ర గ్రంథాన్ని ఎంతో శ్రమ కోర్చి ఎన్నో కొత్త విషయాలతో వెలుగులోకి తెచ్చాడు. వీరి తెలంగాణ స్వాతంత్య్రోద్యమ చరిత్రను అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్‌ ఆవిష్కరించారు. వందల సంఖ్యలో వ్యాసాలు వివిధ పత్రికల్లో అనేంకాంశాలపై ప్రచురించాడు. ఆలిండియా రేడియోలో ఆయన చేసిన ప్రసంగాలు, నాటకాలు అన్నీ ఆణిముత్యాలే. మల్లి, చేనుకాడ, మంచెమీద నాటికలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆయన రాసిన వందలాది బాల గేయాల్ని ‘హసీనా' పేరిట వెలువరించాలనుకున్న కల తీరనే లేదు.

దాశరథి కృష్ణమాచార్య, కాళోజి, శివశంకరశాస్త్రి, సానె గురూజీ, ప్రేంచంద్‌ మొదలైన తన అభిమాన రచయితల స్ఫూర్తితో ఎన్నో రచనలు వెలువరించాడు. కథలు, నాటకాలు, కవిత్వం, గేయాలు ఇలా ఒక్కటేమిటి అనేక ప్రక్రియల్లో పలు రచనలు చేసిండు. గోలకొండ పత్రికలో ఉపసంపాదకులుగా పనిచేస్తున్న కాలంలో అనేక మంది పెద్దలతో పరిచయముండేది. సురవరం, మాడపాటి, బూర్గుల, పండిత నరేంద్రజీ, శివశంకర శాస్త్రి ఇంకా ఎందరో గోలకొండ దర్బారులో పాల్గనేవారు. తన రచనలు కేవలం గోలకొండ పత్రికలోనే గాకుండా సుజాత, శోభ, తెలుగు స్వతంత్ర మొదలైన పత్రికల్లో వెలువరించేవాడు. సంఘసేవకు మద్యపాన నిరోధక ప్రచార మార్గాన్ని ఎంచుకున్నాడు. నిజాం ప్రభుత్వం వివిధ భాషల్లో మద్యపాన నిరోధ ప్రచారానికి గాను పోస్టర్లు, కళాజాతలు, పాటలు, సభలు, సమావేశాలు, పత్రికల ద్వారా ఊరూరా ప్రచారం చేయించేవారు. ఈ శాఖలో పౌరసంబంధాల అధికారిగా ఉంటూ తెలుగులో వెలువడ్డ ‘మద్యపాన నిరోధక పత్రిక'కు సంపాదకులుగా వ్యవహరించారు. ముస్లిం మత పెద్దలు, సంఘ సంస్కర్తలతో కూడిన ప్రచార కమిటీకి సమన్వయ కర్తగా వ్యవహరిస్తూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ సభలు, సమావేశాలు, కళాజాతల ద్వారా మద్యపాన నిరోధాన్ని వెల్దుర్తి ప్రచారం చేసేవారు. అందులో భాగంగానే ‘దయ్యాల పన్గడ' నాటకాన్ని వెలువరించాడు.

హైదరాబాద్‌ రాజ్యం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైన తర్వాత హైదరాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వోద్యోగిగా షాద్‌నగర్‌, మహబూబునగర్‌ లాంటి ప్రాంతాల్లో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారి స్థాయిలో పనిచేశారు. దాదాపు ఇదే కాలంలో హైదరాబాద్‌ కోఆపరేటివ్‌ జర్నల్‌, గ్రామసుధార్‌, రిసాల తర్కెముస్కిరాత్‌ పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు చేపట్టి సమర్దవంతంగా నిర్వహించాడు. విజయవాడ నుంచి వెలువడ్డ ‘యుగవాణి' పత్రికకు ‘హైదరాబాద్‌ లేఖలు' కాలమ్‌ని నిర్వహించాడు. 1938లో కె.సి.గుప్తతో కలిసి హైదరాబాద్‌లో కేవలం ఒక్క అణాకే పుస్తకాన్ని అందివ్వాలన్న ఉద్దేశ్యంతో ‘అణా గ్రంథమాల'ను స్థాపించారు. సాధన సమితి, ఆంధ్రసారస్వత పరిషత్‌ నిర్వాహణలో కూడా వెల్దుర్తి పాలు పంచుకున్నాడు. సారస్వత, సాంస్కృతిక రంగాలతోపాటుగా రాజకీయ రంగంలో కూడా వెల్దుర్తి తన ముద్రను చాటుకున్నాడు. 1938లోనే ఆంధ్రమహాసభ కార్యదర్శిగా పనిచేశాడు. ప్రభుత్వోద్యోగిగా ఉంటూనే పౌరహక్కుల కోసం ఉద్యమాలు చేశాడు. హైదరాబాద్‌లో రజాకార్ల చర్యల్ని ఎండగట్టిన అతి కొద్దిమందిలో ఈయనొకరు. చెన్నారెడ్డి తాను రాసిన దయ్యాల పన్గడలో వేషం వేసేవాడు. అలాగే అనంతర కాలంలో చెన్నారెడ్డి విజయవాడ నుంచి హైదరాబాదీయుల కోసం నిర్వహించిన ‘హైదరాబాద్‌' పత్రిక నిర్వహణలో కూడా వెల్దుర్తి పాలు పంచుకున్నాడు.

వెల్దుర్తి మాణిక్యరావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శి ఎం.ఎల్‌. నరసింహారావు నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటయ్యింది. ఇందులో దేవులపల్లి ప్రభాకరరావు, వెల్దుర్తి అన్నపూర్ణ, సంగిశెట్టి శ్రీనివాస్‌, వాసిరెడ్డి నవీన్‌, పాశం యాదగిరిలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ వారు వెల్తుంర్తి రచనలన్నింటిని సంకలనాలుగా వెలువరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమ చరిత్ర పుస్తకాన్ని మొదటి సంపుటిగా వెలవరించనున్నారు.

మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో రుక్మిణమ్మ, వెంకటేశ్వరరావు దంపతులకు జన్మించిన మాణిక్యరావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో గల మున్సిపల్‌ క్వార్టర్స్‌లో నివసించిన వెల్దుర్తి జూలై 28, 1994నాడు మరణించారు. ఆయన భార్య విమలాదేవి కూడా సారస్వత, రాజకీయోద్యమాల్లో భర్తకు అండగా నిలిచింది. తండ్రి నుంచి సాహిత్యాన్ని వారసత్వంగా స్వీకరించిన వీరి కుమారుడు హర్షవర్ధన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉన్నతోద్యోగంలో ఉన్నారు. పాత తరం తెలంగాణ సాహితీ వేత్తలెవరికీ తమ రచనల్ని అచ్చేసుకోవాలనే కోరిక ఉండేది కాదు. అందువల్ల వారి రచనలు చాలా వరకు పుస్తకం రూపంలో రాకుండా పోయాయి. వెల్దుర్తి రచనలు కూడా అధిక భాగం అచ్చుకు నోచుకోలేదు. ఈయన రాసిన కథలు నలభైకి పైగా ఉన్నప్పటికీ ఇప్పుడు అందుబాటులో ఉన్నవి పదికి మించవు. ఇప్పటికైనా ఆయన రచనలన్నీ సేకరించి ఆయన శతజయంతి నాటికి పూర్తి స్థాయిలో అచ్చేసి నట్లయితే పాత తరం తెలంగాణకు సంబంధించిన ఎన్నో కొత్త కోణాలు బయటకు వచ్చే అవకాశముంది. అలాగే ఏదైనా విశ్వవిద్యాలయంలో ఆయనపై పి.హెచ్‌.డీ పరిశోధన జరిపించేలా తెలంగాణాభిమానులు, సాహితీ వేత్తలు, ప్రొఫెసర్లు కృషి చేయాలి.

- సంగిశెట్టి శ్రీనివాస్‌

English summary

 An eminent social analyst and researcher Sangishetti Srinivas remembers Veldurthi Manikya Rao's contribution during centenary year of veldurthi Manikya Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X