పాటిల్ వ్యూహం: పొమ్మనలేక సచిన్‌కు పొగ?

నాగపూర్ టెస్టు మ్యాచు పూర్తయిన తర్వాత తాను వన్డేల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాలని టెండూల్కర్ అనుకున్నారని చెబుతారు. ఈ విషయమై వార్తలు కూడా వచ్చాయి. అయితే, బిసిసిఐ అధికారి ఒకరి సలహా మేరకు ఆ ఆలోచనను ఆయన విరమించుకున్నట్లు చెబుతున్నారు. దాంతో పాకిస్తాన్‌తో జరిగే వన్డే మ్యాచుల్లో ఆడాలని సచిన్ టెండూల్కర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రపంచ కప్ పోటీల తర్వాత సచిన్ వన్డేల్లో ఆడింది కూడా చాలా తక్కువ. ఆస్ట్రేలియా ముక్కోణపు సిరీస్, ఆసియా కప్ పోటీల్లో మాత్రమే ఆడాడు. తాను ఆడకూడదని అనుకున్నప్పుడు సచిన్ టెండూల్కర్ సెలెక్టర్లకు ముందే ఫోన్ చేసి చెప్పేవాడు. అయితే, పాక్ సిరీస్ విషయంలో సచిన్ అలాంటిదేమీ చేయలేదు. దీంతో అతను పాకిస్తాన్‌తో జరిగే సిరీస్‌లో ఆడాలని నిర్ణయించుకున్నట్లే భావించాల్సి ఉంటుంది.
పాకిస్తాన్‌తో సిరీస్‌కు జట్టు ఎంపిక చేయడానికి ఒక రోజు ముందు సందీప్ పాటిల్ సచిన్ టెండూల్కర్‌కు ఫోన్ చేసి విషయం వివరించాడని అంటారు. సచిన్ ఎంపికపై బిసిసిఐ సెలెక్షన్ కమిటీలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలను సందీప్ పాటిల్ చెప్పాడట. టెండూల్కర్‌ను తప్పించే విషయంలో తానేమీ పట్టుదలతో లేనని, అయితే కొనసాగించడానికి పట్టుబట్టే స్థితిలో కూడా లేనని చెప్పాడని అంటారు.
అంతేకాకుండా, 2015 ప్రపంచ కప్ పోటీలకు జట్టును సిద్ధం చేసే ప్రక్రియను ఆరంభించాల్సి ఉందని, చాలా మంది కుర్రాళ్లు జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నారని అని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. వన్డేలో కొనసాగాలా, వద్దా అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని సందీప్ పాటిల్ సచిన్ టెండూల్కర్‌కు చెప్పాడని అంటారు.
పాటిల్ మాట్లాడిన తర్వాత సచిన్ టెండూల్కర్ ఓ నిర్ణయానికి వచ్చి వన్డేల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో సందీప్ పాటిల్, సచిన్ టెండూల్కర్ కలిసి నిర్ణయాన్ని బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు చెప్పారని అంటారు. సందీప్ పాటిల్ చొరవ, వ్యూహం కారణంగా సచిన్‌ను పెద్దగా నొప్పించకుండా సమస్య పరిష్కారమైందని అంటున్నారు.
సచిన్ తప్పుకోవడానికి బిసిసిఐ గానీ సెలెక్టర్లు గానీ ఒత్తిడి చేయలేదని, సచిన్ ఎవరూ ఎలాంటి నిర్ణయాన్నీ బలవంతంగా రుద్ద లేదని రాజీవ్ శుక్లా అన్నారు. సరైన్ సమయంలో సచిన్ సరైన నిర్ణయం తీసుకున్నాడని ఆయన అన్నారు. రిటైర్మెంట్ విషయంలో తమ విధానం స్పష్టంగా ఉందని, ఆటగాడే నిర్ణయం తీసుకోవాలని, ఎలాంటి సలహాలు కూడా ఇవ్వబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications