ముందే వచ్చిన వేసవి: మండుతున్న ఎండలు, విలవిల

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే తెలంగాణలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని హకీంపేట మినహా దాదాపు అన్నిచోట్లా 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. శనివారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో గత పదేళ్ల రికార్డును పటాపంచలు చేస్తూ 41 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

ఇక హైదరాబాద్‌లోనూ రెండు, మూడు రోజుల్లో పదేళ్ల రికార్డును దాటిపోతుందని అధికారులు భావిస్తున్నారు. మెదక్‌లో 39 డిగ్రీలు ఉండగా మిగిలిన చోట్ల నలభై డిగ్రీలు నమోదైంది. ఇక ఉత్తర భారతంలోని వివిధ ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పైపైకి దూసుకెళ్తున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో వేడి గాలులు వీస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలు ఉత్తర మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈశాన్య భారతంలోని వివిధ ప్రాంతాల్లో ముందస్తు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

Heatwave in MP, Maharashtra, AP, Telangana, Mercury to rise in North India

రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా 20 నుంచి 24 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రామగుండం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, హకీంపేటలో రాత్రిపూట ఉష్ణోగ్రత ఈ మధ్య ఎన్నడూ లేనంతగా 24 డిగ్రీలను తాకింది. హన్మకొండ, ఖమ్మం, హైదరాబాద్‌, భద్రాచలం పట్టణాల్లో 23 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు ఉపశమన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కొబ్బరి బొండలు, పుచ్చకాయల కొనుగోళ్లు పెరిగాయి. పిల్లలు, వృద్ధులు ఎండలకు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

ఏపీ, తెలంగాణలపై యాంటీ సైక్లోన్‌ వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలపై యాంటీ సైక్లోన్‌ కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ 50 శాతంలోపే ఉండటంతో వేడి క్రమంగా పెరుగుతున్నదని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పైగా సూర్య కిరణాలు నిటారుగా భూమిని తాకుతుండటంతో భూమి త్వరగా వేడెక్కుతోంది. ఈ కారణంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న రెండు, మూడు రోజుల్లో సాధారణానికి మించి రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాల్లోనూ ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లు స్పష్టం చేసింది.

ఆదిలాబాద్‌లో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్‌ జిల్లా వేసవి ఆరంభంలోనే అగ్నిగోళంలా మారింది. శనివారం 41 డిగ్రీలతో రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదివారం 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతతో రికార్డుస్థాయిని నమోదు చేసింది. గత వారం రోజులుగా భానుడి భగభగలతో జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు. ఈ నెల 20 నుంచి క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి.

సహజంగా ఆదిలాబాద్‌ జిల్లాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైన వాతావరణం ఉంటుంది. చలి, ఎండ.. కాలమేదైనా ఆదిలాబాద్‌లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం సర్వసాధారణంగా మారింది. అయినా ఈ సారి నెలరోజుల ముందే సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపడం చూస్తుంటే మున్ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని జిల్లావాసులు భయపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప జనాలు పగటి వేళల్లో బయటకు వెళ్లేందుకు సాహహించడంలేదు. రోడ్లు నిర్మానుష్యమవుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Beginning from North India, the affecting Western Disturbance has moved away and clear weather conditions are now prevailing over entire region. This has paved for hot northwesterly winds which are now reaching up to northwestern plains including Delhi NCR and Central India. As a result, both day and night temperatures are likely to increase gradually over the region including Delhi NCR.
Please Wait while comments are loading...