బాడీ వార్న్ కెమెరాలు: ఒంటికి కళ్లు (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఎక్కడ ఏ నేరం, ఘోరం జరిగినా నిందితులను పట్టుకునేందుకు పూర్తిగా సిసి కెమెరాలపై ఆధారపడి ఉన్న పోలీసులు ఇపుడు సరికొత్త కెమెరాలను ప్రవేశపెడుతున్నారు. బాడీ వార్న్ కెమెరాలు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. నగరంలో ఎక్కడైన వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించినా, నిబంధనలను అతిక్రమించిన వారి నుంచి లంచాలు తీసుకున్న పోలీసులను సైతం క్షణాల్లో ఉన్నతాధికారులకు అవి వెంటనే పట్టిస్తాయి.
వీటిని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కేవలం నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులను గుర్తించటంతోపాటు పోలీసులు విధి నిర్వహణకు సంబంధించి ఎప్పటికపుడు కమిషనర్ ఆఫీసులోని సెంట్రల్ సర్వర్‌కు వీడియో చిత్రాలు అందించే ఈ ఆధునిక కెమెరాలను వినియోగించటంతో ఆధునిక పోలీసింగ్ వ్యవస్థను వినియోగించుకోవటంలో ఇపుడు హైదరాబాద్ అమెరికా వంటి అగ్రరాజ్యాల సరసన చేరింది.
రూ. లక్ష విలువ చేసే ఇలాంటి కెమెరాల కోసం మొత్తం రూ. కోటి వెచ్చించి, తొలి దశగా వంద కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇటీవల విదేశాల్లో పర్యటించిన రాష్ట్ర మంత్రులు అక్కడి పోలీసులు ఈ కెమెరాలను వినియోగిస్తూ నేరాలను అదుపు చేయటంతో పాటు ఎలాంటి అవినీతి, నిర్లక్ష్యానికి తావులేకుండా తాము కూడా విధి నిర్వహణను, డ్యూటీలో నిబద్దత, చిత్తశుద్ధిని పెంపొందించుకుంటున్నట్లు గుర్తించారు.

ఏం చేస్తాయి..
బాడీ వార్న్ కెమెరాలు పంపే సమాచారం, ఆడియో, వీడియోలను ఎప్పటికపుడు సంబంధిత పోలీస్‌స్టేషన్, పోలీసు, ట్రాఫిక్ కంట్రోల్ రూంకు చేరవేస్తోంది. అలాగే మెయిన్ సెంట్రల్ సర్వర్‌లో ఈ డేటాను సేవ్ కూడా చేస్తుంది. మెయిన్ సర్వర్‌లో ఈ డేటాను తొలగించటం ఎవరికి సాధ్యపడదని పోలీసులు చెబుతున్నారు.

బాడీ వార్న్ కెమెరా అంటే?
ఇప్పటి వరకు సిసి కెమెరాలు, పెన్ కెమెరాల పేర్లు మాత్రమే మనం విన్నాం. బాడీ వార్న్ కెమెరాలంటే విధి నిర్వహణలో ఉన్న పోలీసు తన ఒంటికి ఓ ఆధునిక కెమెరాలను పెట్టుకుని ఉంటాడు.

పూర్తి వివరాలు..
బాడీ వార్న్ కెమెరాను ధరించిన పోలీసు నిల్చున్న ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది? ఏ వాహనదారుడు ఏ రూట్‌లో వెళ్లాలి? అందుకు విరుద్దంగా ఎక్కడ వెళ్తున్నాడు? అక్రమ పార్కింగ్ ఎక్కడెక్కడ జరుగుతోంది? అన్న పూర్తి వివరాలను వీడియో చిత్రీకరించి, సెంట్రల్ సర్వర్‌కు పంపుతుంది.

ఇలా కూడా..
కేవలం ఎదుటి వారి గురించే కాదు. దీన్ని ధరించిన పోలీసు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు? ఎలా నిర్వహిస్తున్నారు? తన వద్దకు విచ్చిన వారితో ఏం మాట్లాడుతున్నాడన్నదీ కూడా ఈ కెమెరాలో ఎంతో స్పష్టంగా రికార్డు అయి అప్పటికపుడు ఉన్నతాధికారులు వీక్షించేందుకు అందుబాటులో ఉంటుంది.

బరువు తక్కువ..
కేవలం 140 గ్రాముల బరువుతో ఉన్న ఈ కెమెరా ఇంటర్నల్ 8జిబి, ఎక్స్‌టర్నల్ 32జిబితో మొత్తం 40 జిబి సామర్థ్యంతో, ఎనిమిది గంటల బ్యాకప్ బ్యాటరీ, హెచ్‌డి క్వాలిటీలో వీడియోను చిత్రీకరించటం బాడీ వార్న్ కెమెరాల ప్రత్యేకతలు.

ఏడాది క్రితం..నాలుగుతో మొదలు
ఏడాది కాలం క్రితం ఈ బాడీ వార్న్ కెమెరాలను నగర పోలీసులు ప్రయోగాత్మంగా నాలుగు వినియోగించటం ప్రారంభించారు.

ఫలితం కనిపించింది..
ప్రయోగాత్మకంగా వాడిన నాలుగు కెమెరాలు కూడా ఎప్పటికపుడు అందించటం, ఆ సమాచారంతో సత్పలితాలు వస్తున్నందున ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా గత మార్చి, ఏప్రిల్ మాసాల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, తొలి దశగా వంద కెమెరాలను నగర పోలీసులు సమకూర్చుకున్నారు.

ప్రత్యేక శిక్షణ..
ఇంతకుముందే ఈ కెమెరాల వినియోగంపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణను కూడా ఇచ్చారు. వంద కెమెరాలు మొదటి దశలో పనిచేస్తాయి.

ప్రయోజనం ఏమిటి?
బాడీ వార్న్ కెమెరాలను వినియోగించటం వల్ల ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలు పెరిగి ఫ్రెండ్లీ పోలీస్ నూటికి నూరు శాతం సాధ్యమవుతోంది. కెమెరా ధరించి పోలీసులు ఉండటంతో పోలీసులు, వాహనదారులు పరస్పరం ఒకరితో మరొకరు మర్యాదపూర్వకంగా వ్యవహారించే అవకాశం ఏర్పడుతుంది.

సంఘటన గురించి స్పష్టంగా..
వాహనదారులు, పోలీసుల్లో ఎవరు దురుసుగా వ్యవహారించినా, కఠిన చర్యలు తప్పని పరిస్థితి. మరికొన్ని సందర్భాల్లో పోలీసుల అవినీతి, నిర్లక్ష్యం అంటూ ప్రజలు రొటీన్‌గా ఆరోపణలు చేయటం బాగా తగ్గి, ప్రజలు, పోలీసుల మధ్య మంచి సంబంధాన్ని పెంపొందిస్తుంది.

ఉద్దేశం ఇదే..
పోలీసులైనా, ప్రజలైనా ఎవరైనా నిబంధనలకు లోబడి వ్యవహారించాలన్నదే ఈ కెమెరా వినియోగం వెనుక ఉన్న అసలు ఉద్దేశం

బాడీ వార్న్ కెమెరాలు..
హైదరాబాదులో బాడీ వార్న్ కెమెరాలను ఉపయోగించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అగ్రరాజ్యాల సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications