వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ మారుతారా?

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
ఎన్నికల్లో ఘోర వైఫల్యాన్ని చవి చూసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మారుతారా? ఆయన వ్యవహార శైలిలో మార్పు వస్తుందా? పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారా? తన ఒంటెత్తు పోకడలను మార్చుకుంటారా? వంది మాగధులను పక్కన పెట్టి మిగతా వారి సలహాలు తీసుకుంటారా? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడం చాలా కష్టమే. కానీ కెసిఆర్ మాత్రం మారక తప్పని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆయన వ్యక్తిగత రాజకీయ మనుగడనే ప్రస్తుతం ప్రమాదంలో పడింది. తాను రాజకీయంగా ఉనికి కోల్పోకుండా ఉండడానికైనా మారాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనపై ఆయన చిత్తశుద్ధిని పక్కన పెడితే తన రాజకీయ ఉనికి కోసమైనా, తెలంగాణలో తన రాజకీయ ప్రాబల్యానికైనా మారక తప్పదు.

గత కొద్ది రోజులుగా ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు ఏ మేరకు ఫలితాలు సాధిస్తాయో చెప్పడం కూడా కష్టమే. అయితే కెసిఆర్ మీద మాత్రం ముప్పేట దాడి మొదలైంది. కాంగ్రెసు నుంచి, పార్టీ అసమ్మతివాదుల నుంచి, ఇతర తెలంగాణ ఉద్యమ కారుల నుంచీ సంస్థల నుంచీ ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. ఈ మూడు దాడులకు కారణాలు వేరు వేరే అయినా లక్ష్యం మాత్రం ఒక్కటే. అది కెసిఆర్ రాజకీయ జీవితాన్ని జీరో చేయడం ఆ దాడుల లక్ష్యం.ఈ స్థితిలో ఆయన ఎంతో చిత్తశుద్ధిని, నిజాయితీని, పారదర్శకతను పాటిస్తే తప్ప ఆయన నిబద్ధత రుజువు కాని పరిస్థితి ఉంది.

అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ వాదాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఒక వైపు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు రాజకీయంగా కెసిఆర్ ను చావుదెబ్బ తీయాలని చూస్తున్నారు. ఆయన మంత్రివర్గ సమావేశంలో తన మంత్రులకు ఇచ్చిన సూచనలు అవే. శాసనసభలో వైయస్ రాజశేఖర రెడ్డి కెసిఆర్ పై దాడి చేసిన తీరు ఆ విషయాన్ని పట్టిస్తోంది.

కెసిఆర్ రాజకీయ వ్యక్తిత్వాన్ని పలుచన చేసే పనికి ఆయన ఒడిగట్టారని అనుకోవచ్చు. ఆయనతో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా అదే పనికి పూనుకుంటారని చెప్పడంలో సందేహం లేదు. ఇదే సమయంలో కెసిఆర్ ను వ్యతిరేకించి దిలీప్ కుమార్, వి ప్రకాష్ వంటి నాయకులు తెలంగాణ విమోచన సమితిని స్థాపించారు. ఇంకా పార్టీలో అసమ్మతివాదులు ఉన్నారు. పార్టీలోని అసమ్మతివాదులను బుజ్జగించడమో, వారికి నచ్చజెప్పడమో చేయాల్సిన పని కెసిఆర్ చేపట్టాల్సి ఉంటుంది.

అంటే ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఆ తర్వాత ఇతర తెలంగాణ సంస్థలు. 25కు పైగా ఉన్న తెలంగాణ సంస్థలు చాలా వరకు కెసిఆర్ కు వ్యతిరేకంగానే ఉన్నాయి. గద్దర్ వంటివారు, జనశక్తి నేత రాజన్న వంటివారు కెసిఆర్ ను వ్యతిరేకిస్తూ స్వతంత్రంగా రాజకీయ ఉద్యమాలకు శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉన్నారు. ఇవి ఎలాంటి రూపాలు తీసుకుంటాయనే దానిపై కూడా కెసిఆర్ రాజకీయ జీవితం ఆధారపడి ఉంటుంది. తెలంగాణకు చెందిన వివిధ సంస్థలు చాలా కాలంగా కెసిఆర్ ను వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల తెరాసపై కనిపించని దెబ్బ తగిలింది. అది ఎన్నికల్లో ప్రభావం చూపింది. మొత్తం మీద కెసిఆర్ కు పోయిన వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను సంపాదించుకోవడం అంత సులభమైన పని కాదు. ఆయన ప్రతి అడుగులోనూ నిజాయితీని, చిత్తుశుద్ధిని ప్రదర్సిస్తే తప్ప అది సాధ్యం కాదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X