హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్క సీటొచ్చినా చిరుకు గిరాకీ

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఒక్క లోకసభ సీటు వచ్చినా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు కేంద్రంలో గిరాకీ పెరిగే అవకాశాలే ఉన్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ లోకసభ ఎన్నికల్లో చాలా నిరుత్సాహమైన ఫలితాలను సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలుపుతున్నాయి. అయితే ఏ మాత్రం సీట్లొచ్చినా చిరంజీవికి కేంద్రంలో డిమాండ్ ఉంటుందని అంటున్నారు. కేంద్రంలో యుపిఎకు గానీ, ఎన్డీయెకు గానీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఒక్కటి రెండు సీట్లొచ్చిన పార్టీలకు, స్వతంత్రులకు ఎనలేని డిమాండ్ ఉండే పరిస్థితులు నెలకొన్నాయి.

చిరంజీవికి ఒక్క పార్లమెంటు సీటు మాత్రమే వస్తుందని ఒక ఎగ్జిట్ పోల్ సర్వే చెప్పగా నాలుగు సీట్లు వస్తాయని మరో సర్వే చెబుతోంది. రెండు సీట్లు వచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా మరో సర్వే చెబుతోంది. అసలు ఒక్క సీటు కూడా రాదని మరో సర్వే అంచనా వేసింది. ఒక్క సీటు కూడా రాకపోతే చిరంజీవికి కష్టమే. కానీ ఒక్క సీటు వచ్చినా ఆయన చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రంలో అధికారాన్ని సాధించుకోవడానికి ఆ సీటును కూడా ఆయన అడ్డం పెట్టే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెసుతో బేరసారాలు ఆడి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడానికి ఆయన కొత్త రాజకీయానికి తెర తీసే అవకాశాలు లేకపోలేదు.

తాము నాలుగో కూటమితో ఉన్నామని చిరంజీవి చెబుతున్నారు. ఆ నాలుగో కూటమి అనేది ఎస్పీ నేత ములాయం సింగ్, ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎల్జెపి నేత రాం విలాస్ పాశ్వాన్ లతో కూడింది. అయితే ఎన్సీపీ నేత శరద్ పవార్ ను ఈ కూటమిలోకి లాగి యుపిఎ నాయకత్వాన్ని నిలబెట్టాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. శరద్ పవార్ కు చిరంజీవి అనుకూలంగా ఉన్నారు. ఇదే కనుక జరిగితే చిరంజీవి కేంద్రంలోనూ ప్రధానమైన రాజకీయ నాయకడవుతారు. లేదంటే కాంగ్రెసు నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడే పక్షంలో వీళ్లంతా అటు చేరే అవకాశం ఉంది. ఈ స్థితిలో చిరంజీవి కాంగ్రెసుకు మద్దతివ్వాల్సి రావచ్చు. అప్పుడు ఆయన రాష్ట్రంలో తనకు కాంగ్రెసుకు మద్దతిస్తే అందుకు సిద్ధపడవచ్చు.ఇప్పటికే శరద్ పవార్ తో చిరంజీవి మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

ఇటు ఎన్డీయె కూడా ఎందుకైనా మంచిదని చిరంజీవిని దువ్వే ప్రయత్నం చేస్తోంది. అయితే రాష్ట్ర రాజకీయాలను ప్రధానం చేసుకునే చిరంజీవి తనకు కలిసి వచ్చే వైపే వెళ్లే అవకాశం ఉంది. అలా కలిసి వచ్చే పరిస్థితి కాంగ్రెసుతో వెళ్లితేనే ఉంటుంది. అనకాపల్లిలో కనీసం చిరంజీవి బావమరిది అల్లు అరవిందైనా గెలుస్తారనే అంచనాలు సాగుతున్నాయి. అప్పుడు అల్లు అరవింద్ కేంద్రంలో మంత్రి పదవిని చేపట్టి రాష్ట్రంలో చిరంజీవి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. లేదంటే రొటేషన్ పద్ధతిలో రాష్ట్రంలో కాంగ్రెసు, ప్రజారాజ్యం ముఖ్యమంత్రి పదవిని పంచుకోవచ్చు. మొత్తం మీద, కేంద్ర రాజకీయాలే కాదు, రాష్ట్ర రాజకీయాలు కూడా చాలా అనిశ్చితమైన పరిస్థితిలో ఉన్నాయి. ఈ స్థితిలో చిరంజీవి ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కీలకంగా మారే అవకాశాలు లేకపోలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X