వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారని మనిషి వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Rao
ఈ ఎన్నికల్లో విజయం తర్వాత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మారుతారని అందరూ భావించారు. మరింత హుందాగా, సంయమనంతో వ్యవహరిస్తారని అనుకున్నారు. శాసనసభ ప్రారంభాలు నిజానికి ఆ భావనతోనే మొదలయ్యాయి. ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి, లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ్ లు మాత్రమే కాకుండా ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కూడా శాసనసభలో మాట్లాడిన తీరు, వ్యవహరించిన తీరు ఆ భావనతోనే తన ప్రసంగాన్ని సాగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మొదట్లో చంద్రబాబు మాట్లాడిన తీరు చాలా సంయమనంతోనూ ప్రశాంతంగానూ సాగింది. కానీ వైయస్ రాజశేఖర రెడ్డి తన తీరు మార్చుకోకపోవడంతో సభ వేడెక్కింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చే సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డి సంయమనం కోల్పోయారు. ప్రారంభంలో ప్రశాంతంగా కనిపించిన వైయస్ ప్రసంగం ముగించే సమయానికి తీవ్ర ఉద్రేకానికి, భావోద్వేగానికి గురయ్యారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలు, కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచార సభలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి చెప్పిన మాటలు ఆయన మారలేదని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తాయి. కెసిఆర్ పై ఆయన హుందాతో కూడిన హేతుబద్ద వ్యాఖ్యలు చేస్తే స్వీకరించడానికి బహుశా ఎవరూ వ్యతిరేకంగా ఉండకపోవచ్చు. వైయస్ వ్యాఖ్యలను తిప్పే కొట్టే తెరాస నాయకుల మాటలు కూడా అదే స్థాయిలో ఉండడానికి అవకాశం ఉండేది. కానీ కెసిఆర్ ను వైయస్ తీవ్ర పదజాలంతో దూషించారు. ఆయనపై వైయస్ తన స్థాయికి తగ్గి దూషించారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాలనపై కూడా పాత వ్యాఖ్యలే మళ్లీ చేశారు. నిజానికి, గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు పాలన తీరును దుయ్యబట్టడానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు చాలా శక్తిని వెచ్చించారు. దాన్ని చంద్రబాబు ప్రాబల్యాన్ని, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసి తమను స్థిరీకరించుకోవడానికి అవసరంగా కాంగ్రెసు భావించి ఉండవచ్చు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు పాలనపైనే విసుర్లు సంధించాల్సి ఉంటుందా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది.

తెలంగాణకు రాజకీయ పరిష్కారం చూపడంలో విఫలమైన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి గానీ, కాంగ్రెసు పార్టీ నాయకులకు గానీ తెరాస నాయకుడు కెసిఆర్ ను దూషించే హక్కు ఉంటుందా అనేది ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెసు విఫలమైంది. తెలంగాణపై కచ్చితమైన నిర్ణయం తీసుకుని ఉంటే కెసిఆర్ రాజకీయ మనుగడ కొనసాగడమో, ముగిసిపోవడమో జరుగుతుంది. తెలంగాణకు కాంగ్రెసు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తెరాస అవసరం గానీ, కెసిఆర్ రాజకీయాల అవసరం గానీ ఉండదన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించడం లేదు. లేదా గుర్తించినా కెసిఆర్ ను దెబ్బ తీస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష ఉద్యమం అంతమవుతుందనే తప్పుడు భావనకు ఆయన గురవుతూ ఉండవచ్చు. ఒక రకంగా మంటలను చల్లార్చడానికి ప్రయత్నించే బదులు దాన్ని వైయస్ వ్యాఖ్యలు ఎగదోస్తున్నాయని అనుకోవచ్చు. ఏమైనా, రాజశేఖర రెడ్డి రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత కూడా మారలేదనడానికి ఆయన వ్యవహారశైలి, వ్యాఖ్యల తీరు తెలియజేస్తున్నాయి. చంద్రబాబుకు కూడా ప్రజలు రెండో సారి అవకాశం ఇచ్చిన తర్వాతనే తమ తీర్పును ఆయనకు వ్యతిరేకంగా ఇచ్చారనే విషయాన్ని గుర్తించాల్సి ఉంది. తొలి విడత చేసిన కార్యక్రమాలకు, అనుసరించిన విధానాలకు, తన వ్యవహార శైలికి మద్దతుగా ఇచ్చిన తీర్పుగా చంద్రబాబు భావించి వాటినే అతిగా కొనసాగించడం వల్ల రెండోసారి దెబ్బ తిన్నారనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇది రాజశేఖర రెడ్డికి కూడా వర్తిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X