వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఒక్కడే సొక్కమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారశైలి విచిత్రంగా ఉంది. ఆ వ్యవహారశైలి, ప్రవర్తన తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి కాలధర్మం చెందిన తర్వాత పూర్తిగా బహిర్గతమవుతోంది. తనను తాను సమర్థించుకోవడానికి ఇతరులను నిందించడం ఆయన ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నారు. సాక్షి దినపత్రిక వార్తాకథనాలు చూసినా, ఆయన వ్యాఖ్యలను గమనించినా, ఆయన అనుచరుల అభిప్రాయాలను పరిశీలించినా ఆ విషయం అర్థమై పోతుంది. మొత్తంగా గమనిస్తే జగన్ సానుకూల దృక్పథంతో కాకుండా ప్రతికూల దృక్పథంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే తనకు రాజకీయాల్లో పెద్ద ఆటంకంగా మారిందన్న విషయాన్ని అంగీకరించడానికి కూడా ఆయన ఇష్టంగా లేనట్లుంది. ఇష్టం మాట అటుంచి, ఆ దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు కూడా లేదు. అంటే, తన మాటలను, చేతలను ఆయన వెనక్కి తిరిగి చూసుకోవడం లేదని చెప్పవచ్చు.

తాను ఒక్కడినే రాజకీయాల్లో లేదా వ్యక్తిగత జీవితంలో సొక్కంగా అంటే పరిశుద్ధంగా ఉన్నట్లు, మిగతా వారంతా కల్తీ అయిపోయినట్లు ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆబ్జెక్టివిటీకి ఆయన అర్థాన్ని కుంచింపజేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తాకథనాలను తప్పు పడుతూ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై దుమ్మెత్తి పోసినప్పుడు జగన్ కు చెందిన సాక్షి దినపత్రికలో ప్రచురిస్తున్న వార్తాకథనాలకు అంతే సంకుచిత, వ్యక్తిగత వైఖరి ఉందనే విషయాన్ని ఆయన గమనించడం లేదు. పత్రికలు నిష్పాక్షికంగా వ్యవహరిస్తాయని అనుకోవడం ఆదర్సమే అవుతుందనే విషయం ఈరోజు సాధారణ పాఠకుడికి కూడా తెలుసు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు ఒక రాజకీయ దృక్పథం, పాలిసీ ఉంటుందనే విషయాన్ని జగన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రెండు పత్రికలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. అదే సమయంలో సాక్షి నిష్పాక్షికంగా రాస్తుందని కూడా ఎవరూ నమ్మడం లేదు. ఆ రెండు పత్రికల కన్నా నగ్నంగా సాక్షి వన్ సైడెడ్ గా రాస్తుందనేది కాదనలేని సత్యం. జగన్ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారంటూ, జగన్ పై కుట్ర చేస్తున్నారంటూ సాక్షి దినపత్రిక వార్తాకథనాలు రాజకీయ నాయకులను, పత్రికలను దుమ్మెత్తిపోస్తూ రాయడం నిష్పాక్షికత అనిపించుకోదు. ఇంత వరకు రెండు తెలుగు దినపత్రికలకు మాత్రమే ఆయన ప్రత్యర్థిగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆంగ్ల జాతీయ పత్రికలకు కూడా ప్రత్యర్థిగా మారే ప్రమాదం ఉంది. రెండు ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన వార్తాకథనాలను తప్పు పడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు కారణంగా మారుతున్నాయి. పైగా, ఆ దినపత్రికలకు వ్యక్తిత్వం లేదన్నట్లుగా సాక్షి దిన పత్రిక వార్తాకథనంలోని వ్యాఖ్యలున్నాయి. సాక్షిదంతా తెలుపు, మిగతాదంతా నలుపు అని రాయడాన్ని ఏ విధంగానూ జగన్ వారందరికన్నా భిన్నమని, జగన్ ఈ రాజకీయ, వ్యాపార వ్యవస్థల్లోని వ్యక్తి కాదని ఎవరూ అనుకోరు.

ఇదిలా ఉంటే, సాక్షి దినపత్రికను తన కాంగ్రెసు పార్టీకి చెందినవారిపైన కూడా ఆరోపణలు చేయడానికి వాడుకుంటున్నారనే విషయాన్ని కూడా ఎవరూ కాదనలేరు. పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు మిన్నగా మారిన విషయాన్ని సాక్షి దినపత్రిక వార్తాకథనాల్లోని పంక్తులు పట్టిస్తాయి. పాఠకులు జగన్ అనుకునేంత అమాయకులు మాత్రం కారు. జగన్ కు ఎలాగైతే రాజకీయ ప్రయోజనాలు ఉంటాయో, ఎలాగైతే ఆయన రాజకీయంగా ఎదగాలనుకుంటారో మిగతా నాయకులు కూడా అలాగే ఎదగాలనుకుంటారు. ఇతరులను దెబ్బ తీయడానికి ఎత్తులు జిత్తులు వేస్తారు, వ్యూహాలు పన్నుతారు. వాటిని అమలు చేస్తారు. ఒక అడుగు వెనక్కి, మరో అడుగు ముందుకు వేస్తారు. సమయం అనుకూలంగా లేనప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారు. తనను తాను ఉన్నతుడిగా చిత్రీకరించుకోవడానికి ఇతరులను దమ్మెత్తి పోసే వైఖరిని తీసుకున్నారు. తన ప్రవర్తన ద్వారా ఉన్నతంగా ఎదగడానికి, ముందుకు సాగడానికి ప్రయత్నించడం లేదు.

ఇంకా చెప్పాలంటే, ఆయన చాలా అమాయకంగా వార్తాకథనాలు రాయిస్తున్నారు. అధిష్టానానికి, జగన్ కు మధ్య దూరం పెంచడానికి ఆంగ్ల దినపత్రికలు, కాంగ్రెసులోని కొంత మంది కుట్ర చేస్తున్నట్లు ఆరోపించింది. నిజానికి, అధిష్టానానికి, జగన్ కు దూరం పూడ్చడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడి అది వైరంగా మారింది. ఆ వైరంలో జయాపజయాలు మాత్రమే ఉంటాయి. తనను నిలబెట్టుకోవడానికి చేసే పోరాటం మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించే జగన్ అమాయకత నటిస్తున్నారో, నిజంగానే అమాయకుడో తెలియడం లేదు. నిజంగానే అమాయకుడైతే పార్టీ అధిష్టానాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని, ప్రతిపక్షాలను శాసించాలని, ఇతర పత్రికా సంస్థలకు బుద్ధులు చెప్పడానికి పూనుకుని ఉండరు. ఏమైనా, జగన్ ఘోరంగా నష్టపోయే వైఖరిని మాత్రమే అవలంబిస్తున్నారనేది వైయస్ మరణించిన మరుక్షణం నుంచి ఆయన వేస్తున్న అడుగులే తెలియజేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X