పెరుగుతున్న 2019 అమిత్ షా ఆకాంక్షలు: ఎన్డీయే కొడిగట్టిపోతుందా?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీయే ప్రాధాన్యత కోల్పోయి, నామమాత్రంగా మిగిలిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కమలనాథులు చూపుతున్న దూకుడు, మిత్రపక్షాలతో వ్యవహరిస్తున్న తీరు చూస్తే... అవుననే అనిపిస్తోంది. 2019లో సొంతంగా 350 సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడమే మున్ముందు ఆ పార్టీ వైఖరిని ప్రతిఫలిస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

2014లో బీజేపీ 282 సీట్లతో సొంతంగా మెజారిటీని సాధించినా, మిత్రధర్మాన్ని పాటించి ఎన్డీయే మిత్ర పక్షాలకు ప్రధాని మోదీ తన కేబినెట్‌లో చోటు కల్పించినా శాఖల కేటాయింపులో ఆధిపత్య ధోరణి చూపారు. కీలకమైన శాఖలన్నీ బీజేపీ నేతల వద్దే ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కేవలం బీజేపీకి మాత్రమే పరిమితం కావడం భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతాలనిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

 చంద్రబాబు ఇలా చక్ర‘ధారి'

చంద్రబాబు ఇలా చక్ర‘ధారి'

అటల్‌ బీహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో (1998- 2004) ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీలకు మంచి విలువ ఉండేది. సమతా పార్టీ అధినేత జార్జి ఫెర్నాండెజ్‌ ఎన్డీయేకు కన్వీనర్‌. రక్షణమంత్రి కూడా. పలు కేబినెట్‌ కమిటీల్లో సభ్యుడు. రాజకీయ, విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు ఎన్డీయే పక్షాల అభిప్రాయాలను తెలుసుకునే వారు. మిత్రపక్షాల మాట కూడా చెల్లుబాటయ్యేది. నాడు టీడీపీకి 27 మంది ఎంపీలు ఉండటంతో ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రంలో చక్రం తిప్పారు.

అంతా మోదీ మయమే

అంతా మోదీ మయమే

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా, బీజేపీ అయినా, ఎన్డీయే కూటమైనా అంతా ప్రధాని మోదీమయం. జాతీయ రాజకీయాల్లో ఆ స్థాయి కల నాయకుడు కనబడటం లేదు. అందుకే భాగస్వామ్యపక్షాలైనా సరే... డిమాండ్లు పెట్టే, బెట్టు చేసే పరిస్థితి లేదు. ఈ నెల మూడో తేదీన జరిగిన కేబినెట్‌ పునర్య్వవస్థీకరణలో ప్రధాని మోదీ ఎన్డీయే మిత్రపక్షాలకు గట్టి ఝలక్‌ ఇచ్చారు. ఈ పార్టీల నుంచి ఎవరినీ కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. తద్వారా ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది, ఎవరి స్థానమేమిటనే విషయాల్లో విస్పష్ట సందేశం పంపారు.

శివసేనతో ఇలా చేదు అనుభవం

శివసేనతో ఇలా చేదు అనుభవం

1995 నుంచి బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న శివసేనకు చేదు అనుభవం ఎదురైంది. రెండు దశాబ్దాలుగా మిత్రపక్షంగా ఉన్న శివసేనకు లోక్‌సభలో 18 సీట్లున్నా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో శివసేనకు చోటు దక్కలేదు. నిజానికి బీజేపీ 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో ఒంటరిగా పోటీచేయాలనే ఆలోచిస్తోంది. 2014లో పొత్తుపెట్టుకొని బీజేపీ 23, శివసేన 18 స్థానాల్లో గెలిచాయి. 48 స్థానాల్లో 41 ఎన్డీయే ఖాతాలో పడ్డాయి. కానీ అదే ఏడాది అక్టోబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. బీజేపీ 122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 63 సీట్లు నెగ్గిన శివసేన తర్వాత ఫడ్నవీస్‌ కేబినెట్‌లో చేరింది. నాటి నుంచి నేటి వరకు ఇరుపార్టీల మధ్య సంబంధాలు సజావుగా లేవు. కేంద్ర విధానాలను, రైతుల ఆత్మహత్యల విషయంలో ఫడ్నవీస్‌ సర్కార్ వైఖరిని.. కేంద్, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంటూనే శివసేన బాహటంగా తప్పుపడుతోంది. ఇటీవల జరిగిన ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఇరుపార్టీలు వేర్వేరుగానే పోటీ చేశాయి.

రెండు కేబినెట్ పోస్టులపై ఆశలు గల్లంతు

రెండు కేబినెట్ పోస్టులపై ఆశలు గల్లంతు

ఇక టీడీపీ విషయానికి వస్తే... కనీసం రెండు మంత్రి పదవులు వస్తాయని ఆశించి... భంగపడింది. నిజానికి టీడీపీతో కలిసిసాగడం కమళనాథులకు ఇష్టం లేదనే వార్తలు వచ్చాయి. వాజ్‌పేయి హయాంలో కీలక మిత్రపక్షనేతగా టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు తరచూ ఢిల్లీలో కనిపించేవారు. సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ మిత్రపక్షాల్లో ఒకదాని అధ్యక్షుడిగానే చంద్రబాబును చూస్తున్నారు తప్ప అంతకుమించి ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

ఇలా నితీశ్‌కు మోదీ షాక్

ఇలా నితీశ్‌కు మోదీ షాక్

లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో తెగదెంపులు చేసుకొని... బీజేపీతో ఇటీవలే జట్టుకట్టిన జనతాదళ్‌ యునైటెడ్‌ అధ్యక్షుడు నితీశ్ కుమార్‌కు కూడా మోదీ పునర్వ్యవస్థీకరణలో షాకిచ్చారు. జేడీయూ అధినేత, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ మరీ ఎక్కువ మంత్రిపదవులు అడగటంతో ఆ పార్టీని మొత్తానికే దూరం పెట్టారనే వార్తలు వచ్చాయి. అసలు మంత్రి పదవుల చర్చే రాలేదని జేడీయూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా,నితీశ్‌కు ఇది మింగుడుపడని అంశమే. 2019 ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రధాని రేసులో ఉంటారని భావించిన నితీశ్‌ను తమ వైపు లాగడానికి... మోదీ, అమిత్‌ షాలు వ్యూహాత్మక వైఖరిని అనుసరించి సఫలమయ్యారు.

తప్పనిసరిగా మోదీతో కలిసి నడవాల్సిన పరిస్తితి

తప్పనిసరిగా మోదీతో కలిసి నడవాల్సిన పరిస్తితి

ప్రధాని ఒకవైపు నితీశ్‌ను బాహటంగా ప్రశంసిస్తూ సానుకూల సంకేతాలు పంపగా, మరోవైపు లాలూపై కేసుల పరంపరతో ఆయనతో కలిసి నడవలేని పరిస్థితిని నితీశ్‌కు కల్పించారు. 2013లో బీజేపీ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్డీయే నుంచి వైదొలిగిన నితీశ్‌ నాలుగేళ్లకే తిరిగి అదే పార్టీ చెంతకు చేరారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జేడీయూను చేర్చుకోకపోవడం ద్వారా ఎవరి స్థానమేమిటో మోదీ చూపారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక మిత్రపక్షం అకాలీదళ్‌ను వదిలించుకోవాలనే డిమాండ్లు బీజేపీలో ఎక్కువవుతున్నాయి.

 2014 స్థాయి ప్రదర్శన పునరావృతం సాధ్యమేనా?

2014 స్థాయి ప్రదర్శన పునరావృతం సాధ్యమేనా?

గత నెలలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పార్టీ ముఖ్యులు, కొందరు మంత్రులతో జరిగిన సమావేశంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 350 సీట్లు సాధించడమే బీజేపీ లక్ష్యమని తేల్చిచెప్పారు. హిందీ రాష్ట్రాల్లో 2014 స్థాయి ప్రదర్శనను పునరావృతం చేయడం అసాధ్యమని ఆయనకు తెలుసు. 2014లో మిత్రపక్షాలతో కలుపుకుంటే... యూపీలో 80 స్థానాల్లో 73, బీహార్లో 40 స్థానాలకు 31, మహారాష్ట్రలో 48 స్థానాల్లో 42, మధ్యప్రదేశ్‌లో 29 సీట్లకు 27, చత్తీస్‌గఢ్‌లో 11 స్థానాలకుగాను 10 చోట్ల ఎన్డీయే నెగ్గింది. రాజస్థాన్‌ (25), గుజరాత్‌ (26)లలో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను నిలబెట్టుకోవడం తేలికకాదని అమిత్‌ షా భావిస్తున్నారు.

బీసీ నేతగా నితీశ్ ఇమేజ్‌తో పట్టుకు ఇలా వ్యూహం

బీసీ నేతగా నితీశ్ ఇమేజ్‌తో పట్టుకు ఇలా వ్యూహం

282 సీట్లలో బీజేపీ తొలిసారి గెలిచిన 120 సీట్లపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా స్థానాల్లో విజయం కోసం పార్టీ నాయకులకు, మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. తొలిసారి గెలిచిన 120 స్థానాల్లో సగం చోట్ల తిరిగి నెగ్గితే... మిషన్‌ 350 సాధ్యమని షా విశ్వసిస్తున్నారు. యూపీలో ఈ ఏడాది మార్చిలో బీజేపీ ఘన విజయం తర్వాత ఆశలు పెరిగాయి. గత ఎన్నికల్లో గెలిచిన 71 స్థానాలను నిలబెట్టుకోవడం ఆషామాషీ కాదు. సమాజ్‌వాదీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ మహాకూటమిగా ఏర్పడితే బీజేపీ గట్టిపోటీ ఎదురవుతుంది. బిహార్‌లో 2014లో జేడీయూతో పొత్తులేకుండా పోటీచేసినా మంచి ఫలితాలు రాబట్టిన బీజేపీ ఈసారి సంఖ్య తగ్గకూడదనే లెక్కలతో నితీశ్‌ను అక్కున చేర్చుకుంది. బీసీ నేతగా నితీశ్‌కు ఉన్న గుర్తింపు, క్లీన్‌ ఇమేజ్‌ హిందీ రాష్ట్రాల్లో తమకు లాభిస్తుందనేది బీజేపీ అంచనా. అలాగే బీజేపీ విజయావకాశాలున్న మరో 115 -120 స్థానాలపై అమిత్‌ షా ప్రత్యేక దృషి పెట్టారు.

టార్గెట్ - 350 కోసం ఇలా ఎత్తులు

టార్గెట్ - 350 కోసం ఇలా ఎత్తులు

ఒడిశాలో 21 స్థానాలకు బీజేపీ 2014లో ఒకచోట మాత్రమే గెలిచింది. సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఇక్కడ మెజారిటీ సీట్లపై బీజేపీ దృష్టి సారించింది. అలాగే పశ్చిమ బెంగాల్, కేరళలలో పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ బలం పెరుగుతుందనే ధీమాతో ఉంది. 2014లో కర్ణాటకలో 28 స్థానాలకు 17 చోట్ల గెలిచిన బీజేపీ.. వచ్చే ఏడాది మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలమని విశ్వసిస్తున్నది. తద్వారా కాంగ్రెస్‌ నుంచి ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకోగలమని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ సీట్లను మరింతగా పెంచుకోగలమని భావిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే నానుడి ఉంది. బీజేపీ కూడా తన మిషన్‌ - 350ని చేరుకునే క్రమంలో కొన్ని మిత్రపక్షాలను వదులుకొని, కొత్త మిత్రులతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నదని పరిణామాలు చెబుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With the time fast approaching to see if BJP president Amit Shah’s target for the BJP to secure 350 seats on its own in the next Lok Sabha polls pans out, talk of the ‘end of the NDA’ has begun in political circles. Questions like ‘is the NDA dead?’ have also been raised after the recent Union cabinet reshuffle led to talk of a ‘Team Modi’ to face the 2019 Lok Sabha polls.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి