ఎన్టీఆర్ పోటీ: యూత్ వింగ్ నారా లోకేష్‌దే
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వారసత్వ రాజకీయాల్లో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ విజయం సాధించినట్లు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి పోటీ నుంచి తప్పుకున్నట్లేనని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన లోకసభ, శాసనసభ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏ మాత్రం లేదు. అయినప్పటికీ టిడిపి సీమాంధ్రలో ఘన విజయం సాధించింది.
ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి టిడిపి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. దీంతో రాజకీయాల్లో నారా లోకేష్ తన సత్తా చాటుకున్నట్లయింది. దీంతో నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మహానాడు పోస్టర్లపై చంద్రబాబుతో సమానంగా నారా లోకేష్ చిత్రం చోటు చేసుకుంది.

తెలుగు యువత పగ్గాలను నారా లోకేష్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి నందమూరి హరికృష్ణ నుంచి కూడా ఏ విధమైన వ్యతిరేకత ఎదురు కాకపోవచ్చునని అంటున్నారు. ఎన్నికల్లో నారా లోకేష్ నిర్వహించిన పాత్ర వల్ల అడ్డంకులను అధిగమించినట్లు భావిస్తున్నారు.
నిజానికి నారా లోకేష్ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించారు. అయితే, ఆయన పోటీ చేయలేదు. ఆయన పోటీ చేయకపోవడం వల్ల నందమూరి హరికృష్ణకు టికెట్ నిరాకరించడానికి చంద్రబాబుకు వీలైందని అంటున్నారు. ఏమైనా, టిడిపిలో నారా లోకేష్ ఆధిపత్యం ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications