70ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ స్టైలీష్ ‘హెయిర్’ సీక్రెట్ ఇదే!
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్‌స్టైల్ రహస్యం బట్టబయలైంది.
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్‌స్టైల్ రహస్యం బట్టబయలైంది. ఏడు పదుల వయసులోనూ జుట్టు వూడిపోకుండా ఉండేందుకు ట్రంప్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఆయన వ్యక్తిగత వైద్యుడు డా హరాల్డ్ బార్న్స్టెయిన్ బయటపెట్టారు.
ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ వ్యాయామంతో పాటు జుట్టును కాపాడుకునేందుకు ట్రంప్.. ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని వెల్లడించారు. జుట్టు పెరుగుదల కోసం ప్రోస్టేట్ సంబంధిత డ్రగ్‌ను తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.
సాధారణంగా శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ డీహెచ్‌టీ(డై హైడ్రో టెస్టోస్టిరాన్)గా మారుతుంది. జుట్టుకు కావాల్సిన పోషకాలు అందకుండా డీహెచ్‌టీ అడ్డుపడుతుంది. దీంతో ఎక్కువగా పురుషుల్లో జుట్టు రాలిపోయి బట్టతల ఏర్పడుతుంది. అందుకే టెస్టోస్టిరాన్ హార్మోన్ 'డీహెచ్‌టీ'గా మారకుండా నిలువరించే డ్రగ్‌ను ట్రంప్ తీసుకుంటారని వైద్యుడు హరాల్డ్ వివరించారు.
అదేవిధంగా చర్మ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా యాంటీ బయాటిక్ మందులను తీసుకుంటారట ట్రంప్. గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచేందుకు మందులు వాడతారట. కాగా, డాక్టర్ హరాల్డ్ గత 36ఏళ్ల నుంచీ డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత వైద్యుడిగా పనిచేస్తున్నారు.