అఫ్ఘానీ ఎగ్ మసాలా కర్రీ.. ఇలా చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!
గుడ్డులో అనేక పోషక విలువలు ఉన్నాయి. గుడ్డులో మానవ శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే గుడ్డును పరిపూర్ణమైన ఆహారంగా చెబుతారు. అయితే గుడ్డుతో అనేక రకాలుగా వంటలు చేసుకుంటారు. గుడ్డు పులుసు, ఫ్రై ఇలా వివిధ పద్దతుల్లో వంట చేసుకుంటారు. అయితే అఫ్ఘానీ స్టైల్ లో ఎగ్ మసాలా కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా..? సూపర్ టేస్టీగా ఉండే ఈ అఫ్గానీ ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం ఎలా..? ఏఏ పదార్థాలు కావాలి..?
అఫ్గానీ ఎగ్ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. ఉడికించిన గుడ్లు ఐదు లేదా ఆరు, ఉల్లిపాయలు రెండు, పచ్చిమిర్చి నాలుగైదు, వెల్లుల్లి రెబ్బలు పది, పెరుగు కొద్దిగా, నూనె తగినంత, జీడిపప్పు పది, కరివేపాకు కొద్దిగా, అల్లంవెల్లుల్లి పేస్టు కొద్దిగా, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఉప్పు రుచికి సరిపడా, పసుపు హాఫ్ టీ స్పూన్, గరంమసాలా ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు రెండు స్పూన్ లు తీసుకోవాలి.
ఇక అఫ్గానీ ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా గిన్నెలో గుడ్లు వేసి ఉడికించుకోవాలి. ఈలోపు కర్రీకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుక్కుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, జీడి పప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయాలి. అవి వేగిన తర్వాత చల్లార్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయ-జీడిపప్పుల మిశ్రమం, కొత్తిమీర వేసి పేస్టు చేయాలి. ఇప్పుడు కర్రీ కోసం అదే గిన్నెలో నూనె పోసి షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. అందులో పెరుగు, పసుపు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. ఇప్పుడు ఎగ్స్ ను అందులో వేసి ఉడికించుకోవాలి. చివరగా గరంమసాలా వేసి దింపేస్తే చాలు. ఘుమఘుమలాడే అఫ్గానీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications