బీరకాయ పెసరపప్పు కూర.. ఇలా చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!
బీరకాయ కూర అంటే ఇష్టపడని వారు ఉండరు. లేత బీరకాయ కూర నోట్లో వేసుకుంచే కరిగిపోయేలా ఉంటుంది. ఈ కర్రీని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. అయితే బీరకాయతో పెసరపప్పు జత చేసి బీరకాయ పెసరపప్పు కూర ఎప్పుడైనా ట్రై చేశారా..? సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీల్లోకి ఈ కర్రీ అద్దిరిపోతుంది. మరి బీరకాయ పెసరపప్పు కూర ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
బీరకాయ పెసరపప్పు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పెసరపప్పు ఒక కప్పు, బీరకాయలు అరకిలో, టమాటాలు ఆరు, ఉల్లిపాయలు నాలుగు, నూనె తగినంత, ఆవాలు ఒక టీ స్పూన్, శనగపప్పు రెండు టీస్పూన్లు, మినప్పప్పు రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి ఆరేడు, పసుపు చిటికెడు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారం తగినంత తీసుకోవాలి.
ఇక బీరకాయ పెసరపప్పు కర్రీ విధానం చూస్తే.. ముందుగా ఓ గిన్నెలోకి పెసరపప్పు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోయాలి. పది నిమిషాల పాటు నాన బెట్టుకోవాలి. అవి నానేలోపు బీరకాయలను చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే, ఉల్లిపాయ, టమాటాలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, పసుపు వేసుకుని మీడియం ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంతవరకూ మగ్గనివ్వాలి.

ఇప్పుడు అందులో బీరకాయ ముక్కలు వేసి బాగా మగ్గించాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు నీళ్లు వేసి సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. తర్వాత అందులో కారం వేసి మొత్తం కలిసేలా కలపాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. గ్రేవీ కోసం ఒక గ్లాస్ నీళ్లు పోయాలి. కర్రీ చిక్కబడి.. నూనె పైకి తేలితే చాలు.. సూపర్ టేస్టీ బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications