'క్యాబేజీ చికెన్ కర్రీ'.. కొత్తగా ఉన్నా.. టేస్ట్ మాత్రం అదుర్స్..!
క్యాబేజీ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ చికెన్ కర్రీ అంటే మాత్రం లొట్టలేసుకుంటూ తింటారు. మరి క్యాబేజీ చికెన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా..? వినడానికి కొత్తగా ఉన్నా క్యాబేజీ చికెన్ కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం..?
సూపర్ టేస్టీ క్యాబేజీ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. చికెన్ పావు కిలో, క్యాబేజీ, ఉల్లిపాయలు ఒకటి లేదా రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ , పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు, కారం రుచికి తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా అర టీ స్పూన్, నూనె తగినంత, ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి.
ఇక తయారీ విధానం చూస్తే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకూ వేయించి అందులో చికెన్ ముక్కలను వేయాలి. అలా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి.

ఇప్పుడు చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత క్యాబేజీని వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఆ మిశ్రమాన్ని 10 నిముషాలు ఉంచి బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో తగినంత కారం, ఆ తర్వాత మసాలా పొడులు వేసి బాగా కలుపుకోవాలి. గ్రేవీ తినాలనుకునే వారు ఒక గ్లాస్ వాటర్ పోసుకుని 10 నిముషాలు అలాగే మగ్గించుకోవాలి. అలా క్యాబేజీ, చికెన్ ఉడికిన తర్వాత దించే ముందు కొత్తిమీర వేస్తే సరి.. ఘుమఘుమలాడే క్యాబేజి చికెన్ కర్రీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications