పనస పండు హల్వా ఇలా చేస్తే అదిరిపోతుంది!
సాధారణ స్వీట్స్ తిని విసిగిపోయినప్పుడు రకరకాల హల్వాలు చేసుకుని తింటాం. గుమ్మడికాయ హల్వా, క్యారెట్ హల్వా వంటివి మాత్రమే కాదు ఒకసారి పనస పండు హల్వా తిని చూడండి. ఈ హల్వా చూడటానికి మాత్రమే కాదు, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. పనస పండు సీజన్‌లో ఈ పండుతో రుచికరమైన, ఆరోగ్యకరమైన హల్వా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చెయ్యాలో ఒకసారి చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
పనస పండు గుజ్జు - 2 కప్పులు,
తాటి బెల్లం లేదా సాధారణ బెల్లం- 1 కప్పు,
నెయ్యి- 3 టేబుల్ స్పూన్లు ,
జీడిపప్పు- 15
బాదం పప్పు- 15
యాలుకల పొడి- కొద్దిగా

తయారీ విధానం:
ముందుగా పనస పండు తీసుకుని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేయండి. మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోండి. సుమారు రెండు కప్పుల గుజ్జు తీసుకోవాలి.. కొన్ని చిన్న ముక్కలు పక్కన పెట్టుకోండి - హల్వాలో వేస్తే మరింత రుచి పెరుగుతుంది. కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి జీడిపప్పులు, బాదం పప్పు బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టండి.
ఇలా చేస్తే పనసపండు హల్వా సూపర్ టేస్ట్
అదే నెయ్యిలో పనస పండు గుజ్జు వేసి గట్టిపడే వరకు నిరంతరం కలుపుతూ ఉండండి. కాస్త గట్టిపడిన తర్వాత బెల్లం వేసి మళ్లీ బాగా కలపండి. చక్కెర కంటే బెల్లం వాడితే ఆరోగ్యానికి మంచిది. బెల్లం వేసిన తర్వాత బెల్లం కరిగి మళ్ళీ హల్వా లూజ్ గా అవుతుంది. దానిని కలుపుతూ గట్టిపడేవరకు ఉడికించండి. పాన్‌కు అంటుకోకుండా బాగా దగ్గరకు వచ్చేవరకు కలుపుతూ ఉండండి. ఆపై పక్కన పెట్టిన చిన్న పనస ముక్కలు వేసి కలపండి.
నోట్లో వేసుకోగానే కరిగిపోయే రుచికరమైన పనస పండు హల్వా
అందులో యాలుకల పొడి కూడా వేసి కలపండి. చివరగా వేయించిన జీడిపప్పులు, బాదం పప్పులు వేసి కలిపితే నోట్లో వేసుకోగానే కరిగిపోయే రుచికరమైన పనస పండు హల్వా రెడీ అవుతుంది. ఈ హల్వా పసిపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. సీజనల్ స్వీట్‌గా ఒక్కసారి దీనిని ట్రై చేసి చూడండి.













Click it and Unblock the Notifications