ఆంధ్రా స్పెషల్ 'దిబ్బ రొట్టె'.. షుగర్ పేషెంట్స్ హాయిగా తినొచ్చు..!
టిఫిన్స్ అనగానే చాలామందికి ఇడ్లీ, దోశ, పూరీ, బోండా, ఉప్మా ఇలాంటివే గుర్తుకొస్తాయి. ఎప్పుడూ ఈ టిఫిన్స్ తిని బోర్ కొట్టిందా..? అయితే పాతకాలం నాటి ఈ టేస్టీ టిఫిన్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే.. అదే జొన్నలతో చేసే దిబ్బ రొట్టే.. ఇది ఒక్కసారి తిన్నారంటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం. ముఖ్యంగా షుగర్ పేషంట్స్ ఈ టిఫిన్ హాయిగా లాగించవచ్చు. మరి ఈ సూపర్ టేస్టీ దిబ్బ రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఆంధ్రా స్పెషల్ 'దిబ్బ రొట్టె' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే మినప్పప్పు కప్పు, జొన్న రవ్వ మూడు కప్పులు, ఉప్పు రుచికి సరిపడా, నూనె తగినంత తీసుకోవాలి. ఇప్పుడు దిబ్బ రొట్టె తయారీ విషయానికి వస్తే ముందుగా మినప్పప్పు శుభ్రంగా కడిగి ఐదు గంటలపాటు నానబెట్టుకోవాలి. దాంతోపాటు మరో గిన్నెలో జొన్న రవ్వ వేసి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మినప్పప్పును మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు నానబెట్టుకున్న జొన్న రవ్వను నీళ్లు లేకుండా పిండి గ్రైండింగ్ చేసుకున్న మినప్పిండిలో కలుపుకోవాలి. అలా పిండిని బాగా మిక్సింగ్ చేసి మూత పెట్టి రాత్రంతా పులియ బెట్టాలి. ఉదయాన్నే దిబ్బరొట్టె పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి ఆయిల్ పోయాలి. అలా నూనె వేడెక్కిన తర్వాత గరిటె తీసుకుని పిండిని పాన్ మీద వేయాలి. ఇప్పుడు స్టౌ మీడియా ఫ్లేమ్ లో పెట్టి దిబ్బరొట్టెను క్రిస్పీగా ఎర్రగా బాగా కాల్చుకోవాలి. అలా దిబ్బరొట్టె రెండు వైపులా బాగా కాగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుంటే సరి.. దిబ్బ రొట్టె రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications