మీ శరీరంలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయనే విషయం తెలుసా?
మన శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్స్ చేరితే కలిగే నష్టాలపై శాస్త్రవేత్తలు కొన్ని తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను గుర్తించారు. మైక్రో ప్లాస్టిక్స్ అంటే 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ రేణువులు. ఇవి ఆహారం, నీరు, గాలి ద్వారా మన శరీరంలోకి చేరతాయి. మైక్రో ప్లాస్టిక్స్ మన కణాలలోకి ప్రవేశించినప్పుడు, అవి కణాల గోడలను దెబ్బతీస్తాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి కణాలు పాడైపోతాయి. వాపు వచ్చి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది.
క్యాన్సర్ వస్తుంది
మైక్రో ప్లాస్టిక్స్‌లో ఉండే కొన్ని రసాయనాలు శరీరంలోని హార్మోన్ల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇవి ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను అనుకరించడం ద్వారా ఎండోక్రైన్ వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీనివల్ల సంతానోత్పత్తి సమస్యలు, పెరుగుదలలో లోపాలు, ఇతర హార్మోన్ల సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మైక్రో ప్లాస్టిక్స్ జీర్ణవ్యవస్థలో చేరినప్పుడు అవి పేగు గోడలలో వాపును కలిగిస్తాయి.పేగుల్లోని సూక్ష్మజీవుల సమతుల్యత ను దెబ్బతీయడంవల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. కొంత మందిలో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం లాంటివి వస్తాయి.

కాటన్ దుస్తులు ధరించాలి
గాలి ద్వారా పీల్చిన మైక్రో ప్లాస్టిక్స్ ఊపిరితిత్తుల్లోకి చేరి వాపు, కణజాలం దెబ్బతినడం, శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయి. ప్లాస్టిక్ ఉపరితలాలపై పురుగుమందులు, పారిశ్రామిక రసాయనాలు, భారీ లోహాలు వంటి విష పదార్థాలు అంటుకుంటాయి. ఇవి శరీరంలోకి చేరినప్పుడు, ఈ విష పదార్థాలను కూడా మోసుకెళ్తాయి. కాలేయం, మూత్రపిండాలు, మెదడు వంటి కీలక అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ బాటిల్స్, కప్పులు, కంటైనర్లను వాడటం తగ్గించాలి. గాజు లేదా స్టీల్ కంటైనర్లను ఉపయోగించడం ఉత్తమం. మంచి నీటిని వడపోసి తాగడంవల్ల నీటిలోని మైక్రో ప్లాస్టిక్స్‌ను తగ్గించవచ్చు. ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని వేడి చేయడం మానుకోవాలి. వేడి వల్ల ప్లాస్టిక్ రేణువులు ఆహారంలోకి చేరుకుంటాయి. అలాగే నైలాన్, పాలిస్టర్ దుస్తుల నుంచి మైక్రో ఫైబర్లు విడుదలవుతాయి. ఇవి కాకుండా కాటన్, సహజ ఫైబర్ తో చేసిన దుస్తులనే ధరించాలి.












Click it and Unblock the Notifications