'వంకాయ ఉల్లికారం'.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..!
తెలుగు ప్రజలు వంకాయతో రకరకాల వంటలు చేసుకుంటారు. వంకాయతో ఎలాంటి వంటకాలు చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. అయితే వంకాయ ఉల్లికారం రెసిపీకి ఎంతో ప్రత్యేకత ఉంది. వేడి వేడి అన్నంలో వంకాయ ఉల్లికారం కూర వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ టేస్టీ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలి..? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి..?
వంకాయ ఉల్లికారం కూర రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. గుత్తి వంకాయలు ముప్పావు కేజీ, ఉల్లిపాయలు 5, ఎండుమిర్చి 20, నూనె సరిపడా, ఉప్పు తగినంత, ఆవాలు, జీలకర్ర అర టీస్పూన్, కరివేపాకు 2 రెమ్మలు తీసుకోవాలి. తక్కువ పదార్థాలతోనే ఈ వంటకాన్ని టేస్టీగా, అద్భుతంగా చేసుకోవచ్చు. ఇక వంకాయ ఉల్లికారం తయారీ విధానం చూస్తే..
ముందుగా వంకాయల్ని కడిగి వాటికి మధ్యలో నాలుగు వైపులా గాట్లు పెట్టుకోవాలి. ఆ ముక్కలను ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లికారం కోసం పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలను మీడియం సైజు కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో తగినంత నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఎండు మిర్చి వేసి తక్కువ మంటపై వేయించుకోవాలి.
ఎండుమిర్చి వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఓ సెపరేట్ ప్లేటులోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలోకి ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకూ వేయించుకోవాలి. అదే పాన్ లో మరికొంత నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అందులో వేసి మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మరోవైపు మిక్సీలోకి వేయించిన ఎండు మిర్చిని వేసి మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలోనే ఫ్రై చేసిన ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసి మరో గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు వేయించిన వంకాయల్లో ఉల్లికారాన్ని చొప్పించాలి. ఆ తర్వాత మరోసారి స్టవ్ ఆన్ చేసుకుని అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో వంకాయలు వేసుకోవాలి. మిగిలిన ఉల్లికారాన్ని కూడా వేసి నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి. అలా వంకాయలు నూనెలో సరిగ్గా మగ్గితే.. ఘుమఘుమలాడే వంకాయ ఉల్లికారం రెడీ అయినట్లే..












Click it and Unblock the Notifications