health tips: కండరాలు, నరాల బలహీనత; కాళ్ళు, చేతులు తిమ్మిర్లు: లోపం ఇదే కావచ్చు!!
కండరాల బలహీనత, నరాల బలహీనత, కాళ్ళు, చేతులు తిమ్మిర్లువంటి అనేక అనారోగ్య సమస్యలు ఉంటే విటమిన్ లోపం ఉందని గుర్తించండి. ముందు పౌష్టికాహారం తీసుకోండి.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవలసిన అవసరం ఉంది. సరైన జీవనశైలి, వ్యాయామం, పౌష్టికాహారం, కంటి నిండా నిద్ర ఇవి మన శరీరాన్ని కాపాడతాయి. అయితే ప్రస్తుతం విపరీతమైన పని ఒత్తిడి పెరిగి, సరైన ఆహారాన్ని తీసుకోక, సక్రమమైన జీవనశైలి విధానం లేక, వ్యాయామం చేయకపోవడం వల్ల అనేకమంది అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఇబ్బందులు పడుతున్నారు.

పోషకాల లేమి ఉన్నప్పుడు ఎక్కువ అనారోగ్య సమస్యలు
ఉదయం నిద్ర లేచిన దగ్గరనుంచి కాళ్లు చేతులు తిమ్మిర్లు, ఒళ్ళు నొప్పులు, నరాల నొప్పులు, కండరాల నొప్పులు ఇలా ఒకటి కాదు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్ళాలంటే కూడా ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలో కూడా అర్ధం కానన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు లేకపోలేదు. అటువంటివారు మన శరీరంలో పోషకాల లేమి ఉన్నప్పుడు ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా మన శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ సరైన మోతాదులో అందకుంటే రకరకాల సమస్యలు వస్తాయి.

విటమిన్ బీ12 లోపంతో ఈ అనారోగ్య లక్షణాలు
విటమిన్ బి12, బి కాంప్లెక్స్ విటమిన్ గా చెప్పబడుతుంది. బి12 విటమిన్ లోపిస్తే కండరాల నొప్పులు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, నడకలో తొట్రుబాటు, విపరీతంగా బరువు తగ్గడం, వికారంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాదు హృదయ స్పందన రేటు పెరగడం, చిరాకు, అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. చేసే పనులలో కన్ఫ్యూజన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం సమస్య కూడా వేధిస్తుంది. ఆకలి లేకపోవడం, జ్ఞాపకశక్తి బాగా తగ్గడం, విపరీతంగా నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చీటికిమాటికి డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

ఈ ఫుడ్స్ లో పుష్కలంగా విటమిన్ బీ 12
కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నవారు విటమిన్ బి12 పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకుంటే ఈ సమస్యలను అధిగమించవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఇక విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను చూసినట్లయితే చేపలు, మాంసం, గుడ్లు, పాలు, చీజ్, పాల పదార్థాలు, పెరుగు తదితర ఆహార పదార్థాలలో మన శరీరానికి కావలసిన బి 12 విటమిన్ లభిస్తుంది. విటమిన్ సప్లిమెంట్ల కంటే, బి12 పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తినడం మంచిదని సూచించబడింది.

పౌష్టికాహారంతో బోలెడు అనారోగ్య సమస్యలకు చెక్
ప్రతి ఒక్కరూ సరైన పౌష్టికాహారం తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. అందుకే ప్రధానంగా ప్రతి ఒక్కరూ అనారోగ్యం ఏదైనా ముందు పౌష్టికాహారం పై దృష్టి సారించండి. మంచి పౌష్టికాహారం తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలు ఇట్టే దూరమవుతాయి. అందుకే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడంపై దృష్టి సారించాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications