Health tips: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచే హోంమేడ్ పానీయాలు ఇవే.. ట్రై చెయ్యండి!!
వర్షాకాలంలో వాతావరణం మారడం వల్ల చాలా వరకు జనాలు సీజనల్ వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఋతుపవనాల వల్ల, బయట తేమతో కూడిన పరిస్థితుల వల్ల వివిధ వ్యాధికారక క్రిములు పెరుగుతాయి. ఇది మన వ్యాధి నిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయి.
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి బయటపడడానికి, అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మన ఇమ్యూనిటీపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని రకాల పానీయాలు మన ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

నీళ్లలో తులసి ఆకులను వేసుకుని మరిగించి మనం పానీయంగా తయారు చేసుకుని, అందులో కాస్త తేనె కలుపుకొని తాగితే ఇది మన ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది. తులసిలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి కావలసిన ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి తులసి ఆకులతో తయారుచేసిన పానీయాన్ని తీసుకుంటే వర్షాకాలంలో సీజనల్ రోగాలను రాకుండా అడ్డుకోవచ్చు.
కాస్త అల్లం ముక్కని నీళ్లలో మరిగించి, అందులో కాస్త తేనె కలుపుకొని పానీయంగా తయారు చేసుకుని తాగితే కూడా ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అల్లం మనల్ని జలుబు, ఫ్లూ తదితర ఇతర అనారోగ్యాల నుండి కాపాడుతుంది. ఇక ఇదే క్రమంలో నల్ల మిరియాలను కూడా మెత్తని పొడి చేసి కాస్త నీళ్లలో వేసి మరిగించి అందులో తేనె కలుపుకొని తాగితే కూడా ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.
నల్ల మిరియాలలో మన శరీరాన్ని రక్షించడానికి కావలసిన అనేక పోషకాలు మనల్ని అనారోగ్యం బారిన పడకుండా రక్షిస్తాయి. ఇక కరివేపాకును నీళ్లలో మరిగించి అందులో కాస్త తేనె కలుపుకొని తాగితే ఇది కూడా మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా ఉంచడంలో కీలక భూమిక పోషిస్తుంది.
ఇక గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మరసాన్ని వేసుకొని అందులో తేనె కలుపుకొని తాగితే ఇది కూడా మంచి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. శరీరరక్షణ బలోపేతం చేయడానికి, ఈ సీజన్లో వచ్చే అనారోగ్యాలను దూరం చేయడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకాలస్యం ఈ ఐదు పానీయాలను వర్షాకాలంలో తయారు చేసుకుని తాగి వ్యాధినిరోధక శక్తిని మరింత పెంపొందించుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications