తాటికల్లు ఆరోగ్య అద్భుతాలు తక్కువేం కాదు.. కానీ ఇది గుర్తు పెట్టుకోండి!
గ్రామాల్లో పట్టణాల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా సేవించే పానీయం తాటికల్లు, పండుగలు, పబ్బాలు విందులు, వినోదాలు ఏదైనా సరే తెలంగాణ పల్లెల్లో తప్పకుండా తాటి కల్లు ఉండాల్సిందే అని అంటారు. తాటికల్లులో ముఖ్యంగా పోతుతాడు కల్లు చాలా శ్రేష్టంగా భావిస్తారు.
తాటి కల్లు ఎంతో శ్రేష్టం
చలికాలం ముగుస్తూ వేసవికాలం ప్రారంభ దశ తాటికల్లుకు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలాలలో పోతు తాటి చెట్లు కల్లు వస్తుంది. ఉదయాన్నే ఆరు గంటల నుండి ఏడు గంటల సమయంలో చెట్టుపై నుండి తీసిన కల్లును 30 నిమిషాల వ్యవధిలో సేవించినట్లయితే ఆరోగ్యానికి మంచిదని గ్రామాల్లో ఎక్కువగా భావిస్తుంటారు.

తాటికల్లుతో ఆరోగ్య ప్రయోజనాలు
చెట్టునుండి తీసిన తర్వాత గంటల తరబడి ఆలస్యమైన తాటికల్లును సేవిస్తే అది పుల్లగా మారి అందులో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువగా మారి కడుపులో నొప్పికి కారణం అవుతుంది మరి అలాంటి కల్లు సేవిస్తే కడుపులో తిప్పి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు లేకపోలేవు. తాటికల్లులో విటమిన్లు ,ఖనిజాలు,ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వాటిని కోల్పోకుండా ఉండాలంటే తీసిన వెంటనే సేవించాలి . తాటి కల్లు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
తాటికల్లులో ఎన్నో ఔషధ గుణాలు... అప్పట్లో బాలింతలకు కల్లు
ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి తాటికల్లును దివ్య ఔషధంగా భావించి బాలింతరాలకి పెద్దవారు ఇచ్చేవారు ..బాలింతలకు శరీరంలో రక్తప్రసరణ జరగాలని రక్తం తమ శరీరంలో తొందరగా వృద్ధి చెందడానికి పోతుతాటికల్లు ఒక టానిక్ లాగా పనిచేస్తుంది అని పూర్వం పెద్దవారు నమ్మేవారు. ఒకప్పుడు గ్రామాలలో ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన తాటికల్లు లభించేది. అలాంటి స్వచ్ఛమైన తాటికల్లును బాలింతలు సేవించేవారు.
తాటికల్లుపై పెరిగిన మక్కువ
ఈ మధ్యకాలంలో మద్యం ధరలు కొంతమేర పెరగడం కారణంగా, ధరలు తట్టుకోలేక తాటికల్లు వైపు పరుగులు పెడుతున్నారు. ఇది కేవలం గ్రామాలలోని యువకులే కాదు పట్టణాల నుండి కూడా యువత గ్రామాల వైపు పరుగులు పెడుతూ తాటికల్లు అంటే భలే ఇష్టంగా సేవిస్తున్నారు. తాటికల్లుతో మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.శరీరం హైడ్రేట్ అవుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ సమస్యల నుండి తాటికల్లుతో ఉపశమనం
మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు, యూరిన్ లో మంటగా అనిపించే వారికి, అలాగే కిడ్నీలో రాళ్లు ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉదయాన్నే తగిన మోతాదులో తాటికల్లు సేవించినట్లయితే మంచి ఫలితం ఉంటుందని చెప్తారు. కడుపును శుభ్రం చేసి, రక్త హీనతను నివారించి, గుండె ఆరోగ్యాన్నిచ్చే, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే , జీర్ణ శక్తిని పెంచే తాటి కల్లు తాగటం మంచిదే కానీ ఏదైనా సరే పరిమిత మోతాదులోనే తీసుకుంటే మంచిది.












Click it and Unblock the Notifications