మీ కోటగోడ దృఢంగా ఉందా?
మన కోటగోడ దృఢంగా ఉంటే శత్రువులు లోపలికి రాలేరు. వారిని బయటనుంచే ఎదుర్కోవచ్చు. అలాగే మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటే ఏ క్రిములూ శరీరంలోకి ప్రవేశించలేవు. ఒకవేళ ప్రవేశించినా సులువుగా ఎదుర్కొని చిన్నది పెద్ద జబ్బు కాకుండా చూసుకోవచ్చు. కోటగోడ బలంగా ఉండాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి. కొన్ని విటమిన్లు ఎలా తీసుకోవాలో, ఎందులో లభిస్తాయో తెలుసుకుందాం.
విటమిన్ ఎ : ఇది చాలా ముఖ్యమైంది. జబ్బులతో పోరాడే తెల్ల రక్తకణాలు విటమిన్ ఏ వల్ల చురుగ్గా పనిచేస్తాయి. చిలగడ దుంప, మామిడి పండ్లు, క్యారెట్లు, పాలకూర, బ్రోకలీ, బొప్పాయి పండ్లు, గుడ్లు, చేపల్లో ఎక్కువగా లభిస్తుంది. బీటా కెరొటిన్ కూడా విటమిన్ ఎ రకానికి చెందినదే. నారింజ రంగు, పసుపుపచ్చ పదార్థాల్లో లభిస్తుంది.
విటమిన్ ఇ : విటమిన్ ఇ లోపంతో శ్వాసకోశ జబ్బులు వస్తాయి. అలర్జీలు, ఆస్థమా ముప్పూ ఎక్కువగానే ఉంటాయి. గుమ్మడి పప్పు, పొద్దు తిరుగుడు పప్పు, వంటనూనెలు, తవుడుతో కూడిన గోధుమలు, బాదం, వేరుశనగ, పాలకూరలో లభిస్తుంది. తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచుతుంది.

బి విటమిన్లు : బి విటమిన్లు రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తాయి. ముఖ్యంగా బి6, బి12 శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బంగాళాదుంపలు, తృణధాన్యాలు, చికెన్, గుడ్లు, చేపలు, శనగల వంటి పప్పులు, అరటిపండ్ల వంటి వాటితో బి6 లభిస్తుంది. తెల్ల రక్తకణాలు వృద్ధి చెందాలన్నా, యాంటీబాడీల భాగాలు కలవడానికి విటమిన్ బి12 అవసరమవుతుంది. ఇది చేపలు, మాంసం, గుడ్ల వంటి మాంసాహారంలో ఎక్కువగా లభిస్తుంది.
విటమిన్ సి : వ్యాధినిరోధక శక్తిని పెంచి రోగాలబారిన పడకుండా విటమిన్ సి కాపాడుతుంది. ఇది అత్యంత శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. విటమిన్ సి శరీరంలో నిల్వ ఉండదు. ప్రతిరోజు ఆహారం ద్వారా లభించేలా చూసుకోవాలి. బత్తాయి, నారింజ, జామ, నిమ్మకాయ, ఉసిరికాయ, బ్రోకలీ, పచ్చిమిరప, బంగాళాదుంప, కొత్తిమీరలో లభిస్తుంది.
విటమిన్ డి : రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి విటమిన్ డి అవసరమవుతుంది. చర్మానికి ఎండ తగిలినప్పుడు మన శరీరమే ఈ విటమిన్ ను తయారుచేసుకుంది. గుడ్డులోని పచ్చసొన, జంతు కాలేయంలో కొంత ఉంటుంది.












Click it and Unblock the Notifications