ఐ పిల్ శృంగారానికి ముందు వాడాలా..? తర్వాత వాడాలా..?
అవాంఛిత గర్భధారణను నివారించడానికి అందుబాటులో ఉన్న అత్యవసర గర్భనిరోధక పద్ధతుల్లో ఐ-పిల్ (I-pill) ఒకటి. అయితే, ఈ అత్యవసర మాత్రను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి అనే విషయంలో చాలా మందికి సరైన అవగాహన ఉండదు. ముఖ్యంగా, దీనిని శృంగారానికి ముందు తీసుకోవాలా, లేక తర్వాత తీసుకోవాలా అనే విషయంలో గందరగోళం ఉంటుంది. ఐ-పిల్ లేదా ఏ ఇతర అత్యవసర గర్భనిరోధక మాత్ర అయినా, ఇది శృంగారానికి ముందు ఉపయోగించాల్సిన సాధారణ గర్భనిరోధక పద్ధతి కాదు.
ఐ-పిల్ అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించే 'బ్యాకప్ ప్లాన్' లాంటిది. అసురక్షిత శృంగారం జరిగినప్పుడు లేదా సాధారణ గర్భనిరోధక పద్ధతి (ఉదాహరణకు, కండోమ్ వైఫల్యం) విఫలమైనప్పుడు మాత్రమే దీనిని వాడాలి. ఈ మాత్ర ప్రభావం పూర్తిగా మీరు తీసుకునే సమయంపై ఆధారపడి ఉంటుంది.అసురక్షిత శృంగారం జరిగిన 72 గంటలలోపు (3 రోజులలోపు) ఈ మాత్రను తీసుకోవడం తప్పనిసరి.

వీలైనంత త్వరగా, అంటే శృంగారం జరిగిన మొదటి 24 గంటలలోపు తీసుకుంటే గరిష్టంగా గర్భధారణను నివారించే అవకాశం ఉంటుంది. ఈ మాత్రలోని హార్మోన్లు, అండం విడుదలను ఆలస్యం చేయడం ద్వారా లేదా అండం ఫలదీకరణం చెందకుండా నిరోధించడం ద్వారా గర్భధారణను అడ్డుకుంటాయి.
ఐ-పిల్‌ను తరచుగా లేదా సాధారణ గర్భనిరోధక మాత్రగా వాడటం ఆరోగ్యానికి హానికరం. దీనిని పదేపదే వాడితే హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, రుతుక్రమ సమస్యలు, వికారం, వాంతులు వంటి తీవ్ర దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
అందుబాటులో ఉన్నంత మాత్రాన ఐ-పిల్‌ను ఒక సాధారణ గర్భనిరోధక పద్ధతిగా భావించవద్దు. ఇది కేవలం జీవితంలో వచ్చే అవాంఛిత అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆ తర్వాత వాడాల్సిన కీలకమైన రక్షణ. సురక్షితమైన , స్థిరమైన గర్భనిరోధక పద్ధతుల కోసం ఎప్పుడూ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.












Click it and Unblock the Notifications