ఆరోగ్యాన్నిచ్చే 'జొన్నరొట్టెలు'.. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోండి..!
నేటి కాలంలో ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనం అయిపోయింది. శారీరక శ్రమ లోపించింది. ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారాయి. ఇక చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయ వంటకం అయిన జొన్న రొట్టెలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా జొన్న రొట్టెలు తినడం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలను నియంత్రణలో ఉంచుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇక ఆరోగ్యానికి ఆరోగ్యం తక్కువ ఖర్చుకే ఇవి లభించడం వల్ల ఇటీవలికాలంలో జొన్న రొట్టెలను తినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ ఆరోగ్యకరమైన జొన్న రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
జొన్న రొట్టెలు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే జొన్న పిండి ఒక కప్పు, వేడి నీళ్లు ముప్పావు కప్పు, ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే ముందుగా ఒక గిన్నెలో జొన్న పిండి పోసి కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత కొద్దికొద్దిగా వేడి నీళ్లు పోస్తూ కలపాలి. అలా పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిపెట్టుకున్న పిండిని నిమ్మకాయ సైజంత ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి జల్లి ఈ ఉండను వృత్తాకారంలో పలచగా ఒత్తుకోవాలి. లేదా చపాతీ కర్రతో నెమ్మదిగా రూలింగ్ చేసుకోవాలి.

ఇప్పుడు వేడి చేసుకున్న పెనంపై ఒత్తిపెట్టిన రొట్టెను వేయాలి. రొట్టె పైన కాస్త నీళ్లతో తడపాలి. అలా ఒక నిమిషం తర్వాత రొట్టెను రెండో వైపు తిప్పి మంటను మీడియం లేదా మచ్చలు వచ్చేంత వరకూ కాల్చుకోవాలి. ఇప్పుడు మెత్తని రుచికరమైన జొన్న రొట్టె సిద్ధం అయినట్టే.. ఈ రొట్టెను పల్లీ చట్నీ, కూరలు, పెరుగు లేదా పచ్చడితో తినవచ్చు..












Click it and Unblock the Notifications