కొత్త రుచితో పుదీనా టమాటా పచ్చడి.. ఇదొక్కడి యాడ్ చేస్తే చాలు..!
టమాటో పచ్చడి అంటేనే చాలామందికి నోరూరుతుంది. టమాటో పచ్చడిని పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఏ కాలంలోనైనా టమాటా పచ్చడి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అయితే టమాటా పచ్చడి సూపర్ టేస్టీ గా రావాలంటే పుదీనాతో పచ్చడి చేసుకుంటే సరి.. రుచి అద్భుతంగా ఉంటుంది. అన్నంలోకి మాత్రమే కాదు టిఫిన్స్ లోకి కూడా పుదీనా టమాటా పచ్చడి అద్దిరిపోతుంది. మరి పుదీనాతో టమాటా పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఎలా తయారు చేసుకోవాలి..?
పుదీనా టమాటా పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. టమాటాలు మూడు లేదా నాలుగు పెద్దవి, పుదీనా ఆకులు ఒక కప్పు, అల్లం ముక్క, పచ్చిమిర్చి తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు రుచికి సరిపడా, నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు పుదీనా టమాటా పచ్చడి తయారీ విధానం చూస్తే.. ముందుగా ఓ గిన్నె తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. ఆ తర్వాత నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు అందులో శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో టమాటా ముక్కలు, చింత పండు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికే వరకూ మగ్గించుకోవాలి. ఇప్పుడు వేయించిన ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ మాదిరి చేసుకోవాలి. ఇప్పుడు మరో గరిటెలో నూనె వేసి అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాళింపును పచ్చడిలో కలిపితే సరి.. నోరూరించే సూపర్ టేస్టీ టమాటా పుదీనా పచ్చడి రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications