ఈ వర్షాలకు వేడివేడి "బెండకాయ సాంబార్" ట్రై చేస్తారా..!

బెండకాయ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కూరగాయ. దీనిని ఇంగ్లీషులో ఓక్రా (Okra) లేదా లేడీస్ ఫింగర్ (Lady's Finger) అని అంటారు. ముఖ్యంగా భారతీయ వంటకాల్లో కూడా బెండకాయని ఎక్కువగా ఉపయోగిస్తారు. అందులో ఉండే పోషక విలువలు అధికంగా ఉండడం.. సులభంగా జీర్ణమయ్యే గుణం కారణంగా దీనిని తరచుగా ఆహారంలో చేర్చుతారు. అయితే బెండకాయ అంటే చాలామందికి ఇష్టముండదు.

అయితే బెండకాయ బంకగా ఉంటుందని.. రుచి ఉండదని ఎక్కువ మంది తినడానికి ఆసక్తి చూపరు. కానీ కొందరు మాత్రం బెండకాయ వేపుడు మాత్రమే తింటుంటారు. ఈ తరహా విషయాలు అన్నింటికీ చెక్ పెడుతూ పిల్లలకి అయిన పెద్దలకు అయినా కానీ ఇష్టంగా బెండకాయ తినిపించేందుకు బెస్ట్ ప్లాన్ ఇదే. ఎలాంటి సీజన్ లో అయినా కానీ మంచిగా తినేలా.. మరి ముఖ్యంగా ఈ వర్షాలకు వేడివేడిగా బెండకాయ సాంబార్‌ను ఒకసారి ప్రయత్నించండి. దీన్ని రుచి చూసినవారు లొట్టలేసుకుంటూ తినడం మాత్రం పక్కా అని చెబుతున్నారు. బెండకాయ సాంబార్ ఎలా తయారు చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

okra-sambar-alias-ladies-finger-sambar-telugu-recipe

కావాల్సిన పదార్థాలు..

  • కందిపప్పు - 1 కప్పు (180 గ్రాములు)
  • నూనె - 4 టేబుల్​స్పూన్లు
  • బెండకాయలు - పావుకిలో
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 3
  • పసుపు - పావు చెంచా
  • టమాటా - 1
  • చింతపండు - 50 గ్రాములు
  • కారం - రుచికి తగినంత
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • సాంబార్ పొడి - 1 టేబుల్​స్పూన్
  • బెల్లం తురుము - 1 టేబుల్​స్పూన్
  • కరివేపాకు - కొద్దిగా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

సాంబార్ తాలింపు కోసం..

  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • ఆవాలు - 1 టీస్పూన్
  • మినప్పప్పు - 1 టీస్పూన్
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • ఎండుమిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • ఇంగువ - కొద్దిగా

తయారీ విధానం..

ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టాలి. అలానే ఒక చిన్న గిన్నెలో చింతపండును కూడా నానబెట్టుకోవాలి. ( ఈ లోపు బెండకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి )

ఉల్లిపాయను సన్నని చీలికలుగా, టమాటాను పెద్ద క్యూబ్‌లుగా కట్ చేసి సిద్ధం చేసుకోవాలి.

ప్రెషర్ కుక్కర్ లో నానబెట్టిన కందిపప్పు, మూడున్నర కప్పుల నీళ్లు పోసి మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

కుక్కర్ ప్రెషర్ పూర్తిగా తగ్గాక మూత తీసి, ఉడికిన పప్పును గరిటెతో మెత్తగా మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్‌లో కాసేపు వేయించాలి. బెండకాయ ముక్కలలోని జిగురు పోయి, కాస్త నల్లబడే వరకు వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మరొక పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత పసుపు వేసి మరోసారి వేపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి అవి మగ్గే వరకు ఉడికించాలి. టమాటాలు మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి కలిపి, మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.

ఆ తర్వాత నానబెట్టిన చింతపండు నుంచి తీసిన 250 మి.లీ. రసం వేసి కలిపి, మూత పెట్టి నాలుగు నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి మరో నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు, 150 మి.లీ. నీళ్లు కలిపి బాగా కలిపి, మూత పెట్టి హై-ఫ్లేమ్‌లో బాగా మరగనివ్వాలి.

పప్పు బాగా ఉడుకు పట్టిన తర్వాత సాంబార్ పొడి వేసి కలిపి మరికాసేపు మరిగించుకోవాలి. చివరగా బెల్లం తురుము, కరివేపాకు వేసి కలిపి, మంటను సిమ్‌లో ఉంచి సాంబార్‌ను అలా మరుగుతుండనివ్వాలి.

ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటమనిపించాలి. ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి చక్కగా వేయించుకోవాలి.

వేగిన తాలింపును మరో బర్నర్ మీద మరుగుతున్న సాంబార్‌లో వేసి బాగా కలిపి, మూత పెట్టి మరో రెండు నిమిషాలు మరగనివ్వాలి.

చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దించేసుకుంటే ఘుమఘుమలాడే బెండకాయ సాంబార్ రెడీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+