మూత్రం నుంచి దుర్వాసన వస్తుందా..? మూత్రం లీకేజీ అవుతుందా..?
మనం తినే ఆహారంలోనే మన ఆరోగ్యం దాగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మనం ఆహారం, నీరు తీసుకున్నప్పుడు ఆ ఆహారాన్ని జీర్ణక్రియ ద్వారా శరీరం శక్తిగా మారుస్తుంది. దాంతోపాటు మిగిలిన వ్యర్థ పదార్థాలను మలం, మూత్రం, చమట ద్వారా శరీరం బయటకు పంపిస్తుంది. అయితే ఇవి దుర్వాసన రావడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో మూత్రం నుంచి భరించలేని విధంగా దుర్వాసన వస్తుంటుంది. అయితే దీనికి గల కారణాలను వైద్యులు వివరించారు.
షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారి మూత్రంలో గ్లూకోజ్ శాతం పెరగడం వల్ల వాసన వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మహిళల్లో సహజంగా ఉండే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా మూత్రం వాసనతో పాటు, మంట, తరచుగా మూత్ర విసర్జన అలాగే పొత్తి కడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
అలాగే కాలేయం లేదా మూత్రపిండాల సమస్య ఉన్నవాళ్ల మూత్రం కుళ్లిన వాసన వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. మూత్రం ముదురు రంగులో, నురుగగా లేదా రక్తంతో పాటు దుర్వాసన ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచనలు చేస్తున్నారు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలు, చేపలు వంటి పదార్ధాలు అధిక మొత్తంలో తిన్నా మూత్రంలో అధిక వాసన వస్తుందని.. అలాగే కెఫిన్ ఆల్కహాల్ తీసుకున్న సమయంలోనూ మూత్రంలో దుర్వాసన వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
అలాగే కొన్ని యాంటీబయాటిక్స్, విటమిన్ సప్లిమెంట్లు, వైద్య చికిత్సలు తీసుకున్న సమయంలోనూ మూత్రం నుంచి దుర్వాసన వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. పరిష్కార మార్గంగా రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. లక్షణాలు అలాగే కొనసాగితే మూత్ర పరీక్ష చేయించుకోవడం ఉత్తమం అని వైద్యులు వివరిస్తున్నారు.
అలాగే వయసు పెరిగిన మగవారిలో మూత్ర విసర్జన చేసిన కొద్దిసేపటి తర్వాత కూడా మూత్రం చుక్కలు చుక్కలుగా పడుతుంటుంది. దగ్గినా, తుమ్మినా ఇలా డ్రాప్స్ పడుతుంటుంది. ఇలా మూత్రం లీక్ కావడానికి కారణాలను వైద్యులు వివరించారు. పురుషుల్లో వయసు పెరుగుతున్న కొద్దీ మూత్రనాళానికి చుట్టూ ఉండే ప్రోస్టేట్ గ్రంథి వాపు వస్తుంది. అలా ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బినప్పుడు మూత్రనాళ మార్గం సంకోచిస్తుంది. దీనివల్ల మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి.. మూత్ర విసర్జన ఆగిపోయిన తర్వాత కూడా కొన్ని చుక్కలు పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ సమస్యతో బాధపడేవారు మంచి ఆహారంతో పాటు, వ్యాయామాలు చేస్తే మూత్రం లీకేజీ సమస్య కొంత వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ధూమపానం అలవాటు ఉంటే మానేయాలని సూచిస్తున్నారు. మూత్ర విసర్జనలో సమస్యలు ఉంటే సంబంధిత వైద్యులను సంప్రదించాలని నిపుణులు వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications