వాస్తు ప్రకారం పూజగదికి తలుపు ఉండాలా? ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి?
వాస్తు శాస్త్రం ప్రకారం పూజగదికి కచ్చితంగా తలుపు ఉండాలి. చాలామంది ఇళ్లల్లో స్థలం లేకపోవడమో లేదా ఆధునిక డిజైన్ల కోసమో పూజగదికి తలుపులు పెట్టకుండా కేవలం ఓపెన్ ఆర్చ్ లాగా వదిలేస్తుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు.
పూజగదికి తలుపు ఎందుకు ఉండాలి?
పూజగది అనేది ఇంట్లోనే అత్యంత పవిత్రమైన, అత్యధిక సానుకూల శక్తి ఉండే ప్రదేశం. మనం పూజ, ధ్యానం చేసినప్పుడు అక్కడ ఒక దైవిక శక్తి కేంద్రీకృతమవుతుంది. తలుపులు ఉంటే ఆ శక్తి ఆ గదిలోనే నిలిచి ఉండి, ఇల్లంతా క్రమంగా విస్తరిస్తుంది. దేవుడి గదికి తలుపులు వేసి పూజ చేసుకోవడం వల్ల బయటి శబ్దాలు, ఇంట్లో వాళ్ల కదలికలు మనకు డిస్టర్బెన్స్ కలిగించవు. దేవునిపై ఏకాగ్రత కుదురుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం రాత్రి పూట దేవుడికి కూడా విశ్రాంతి అవసరం. అందుకే రాత్రి పూట పూజ పూర్తయ్యాక దేవుడి గది తలుపులు మూసివేయడం శుభప్రదం.

తలుపులు లేకపోతే ఏమవుతుంది?
ఇంట్లో అన్ని సమయాల్లోనూ పాజిటివ్ వాతావరణం ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఇంట్లో గొడవలు, నెగెటివ్ ఆలోచనలు, లేదా సూతకాలు వంటివి ఉంటాయి. దేవుడి గదికి తలుపులు లేకపోతే ఆ ప్రతికూల శక్తులు నేరుగా దేవుడి విగ్రహాలపై లేదా ఫోటోలపై ప్రభావం చూపుతాయి. దేవుడి గది ఎప్పుడూ తెరిచే ఉంటే.. ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరి దృష్టి నేరుగా దేవుడిపై పడుతుంది. వాస్తు ప్రకారం ఇది అంత మంచిది కాదు. పూజగది ఓపెన్‌గా ఉంటే ఆ గదిలోని దైవిక శక్తి హరించుకుపోతుంది. దీనివల్ల ఇంట్లో అనవసర ఖర్చులు పెరగడం, మానసిక ప్రశాంతత తగ్గడం వంటి పరిణామాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతారు.
పూజగది తలుపుల విషయంలో పాటించాల్సిన ముఖ్య నియమాలు
పూజగదికి ఎప్పుడూ ఒకే తలుపు కాకుండా.. రెండు రెక్కల తలుపులు పెట్టడం అత్యంత శ్రేయస్కరం. తలుపులు లోపలికి తెరుచుకునేలా ఉండాలి. పూజగది తలుపులు ల్యామినేట్ లేదా ప్లాస్టిక్, ఇనుముతో కాకుండా.. మంచి నాణ్యమైన టేకు కలప లేదా ఇతర గట్టి చెక్కతో చేయించుకోవాలి. తలుపులపై స్వస్తిక్, ఓం, కలశం లేదా గజలక్ష్మి వంటి దైవిక చిహ్నాలు ఉండేలా డిజైన్ చేయించుకుంటే చాలా మంచిది.
తలుపులు పెట్టినప్పుడు గదిలో గాలి ఆడటం కోసం తలుపులకు చిన్న చిన్న జాలీలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల లోపల దీపం వెలిగించినా ఆక్సిజన్ కొరత రాదు.
స్థలం లేనప్పుడు మందిరానికి ముదురు రంగు (ఎరుపు, పసుపు లేదా మెరూన్) కలిగిన మంచి డిజైన్ ఉన్న కాటన్ లేదా సిల్క్ తెరలను వాడండి. రాత్రి పూట, లేదా పూజ చేయని సమయాల్లో ఆ తెరలను పూర్తిగా వేసి ఉంచడం ద్వారా వాస్తు దోష తీవ్రతను తగ్గించవచ్చు.














Click it and Unblock the Notifications