వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవ 'సం' బంధాలలో వస్తున్న మార్పులు ఎలా ఉన్నాయంటే..?

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలలో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ ఉంటే..పెద్దగా ఆస్తులు.. చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగాలేని రోజుల్లోనే మనుషుల మద్య ఆప్యాయత అనుబంధాలు చిక్కగా చక్కగా ఉండేవి. ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా.. నీతి నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు. ఉన్నంతలోనే తృప్తిగా గడిపారు. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం.. అందరం దగ్గరి వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా ఉండేది. కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు.

Recommended Video

కరోనా భారిన సోనియా - Get Well Soon

మా మనవడు లేదా మనవరాలు అని తాతలు, మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు. కానీ ఎప్పుడైతే 1983- 84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లల్ని చదివించడానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలైందో.. ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అంది పుచ్చుకుంటూ.. కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో.. మొదట్లో వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసేవారు. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు.

కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో.. వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో.. అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు.. పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది.

ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు.. కొన్న ఆస్తులు.. చేయించుకున్న నగలు.. వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్.. వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే కనుమరుగైపోయింది. చిన్న నాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా.. శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి ఉండేవారు. తరువాత కూడా ఇంకో వారం రోజులపాటు ఉండేవారు. రాత్రి పూట ఆరుబయట అరుగులపై లేదా మంచాలు వేసుకుని పొద్దు బోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు.

Here is how the traditional way of Human relations witnessed changes

ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా.. కార్యం చేసే వారు కూడా అప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా కొంచెం ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు. ఫంక్షన్ కు అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించు కోవడానికి.. తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ.. పారదర్శక సంబంధాలకి ఇవ్వడం లేదు. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హజరులు మిగిలిపోతున్నాయి. అందరికి పిల్లలు దూరంగా ఉంటున్నా.. ఇరుగు పొరుగునే ఉంటున్న రక్త సంబంధీకులతో కూడా ఆత్మీయ అనుబంధాలు ఉంచుకోవడం, పెంచుకోవడంలేదు.

నిష్కారణంగా చిన్న చిన్న కారణాలతోనే విపరీతమైన అహం అతిశయంతో వ్యవహరిస్తూ.. అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచు కుంటున్నారు. నూటికి 90 % కుటుంబాలలో పిల్లలు దూరంగానే ఉంటున్నారు. వీళ్లకు పెద్ధతనం, ఒంటరి తనం, అనారోగ్య సమస్యలు, మనిషితోడు అవసరం. అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో ఉండడం లేదు. విపరీతమైన తామసం. పక్క వాడి నీడ కూడా సహించడం లేదు. చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు.

వలస బాటుల పుణ్యాన గత 60 -70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది. దానికి తోడు కేవలం కూడు, గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం. బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వేళ కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా, రిలేషన్స్ లో ఎమోషన్ ఉంచుకుందాము అనుకున్నా మెజారిటీ కుటుంబాలలో పెద్ద వాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు. చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి.

నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని, మిగలని పరిస్థితిని సృష్టిస్తున్నాము. నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి. అందరూ కొద్దిగా ఆలోచించండి. మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ.. మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము. ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలి. మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము?

ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు. మనకి ఎంత టైం ఉంటుందో తెలియదు. మనం సక్రమంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం అతిశయం వదిలి వెద్ధాము. మన తరువాత కూడా మన పిల్లలకి మన కుటుంబ అనుబంధాలను, ఆత్మీయతను వారసత్వంగా ఇద్దాము. కొన్ని వందల కుటుంబాలను చాలా సమీపంగా చూసి ఆవేదన చెందుతూ.. ఆరోజులలో బందాలు ఎలా ఉండేవి, ఆధునిక కాలంలో విదేశీ విష సంస్కృతి మోజులో పడి ఆత్మీయతలను, అన్యోన్యతలను పోగొట్టుకుని సాధిస్తున్నది ఏమిటని హృదయ వేదన కలవర పెడుతున్నది.

గుణము బాగాలేక పోతే ఏకులమైతే నేమి ఏమిలాభం. కులగణుల కంటే గుణగణులే గొప్పవారు. సాటి వారిని గౌరవించే స్థితిలో లేనప్పుడు ఎంత చదువుకున్నా, ఏ హోదాలో ఉన్నా ఏమి లాభం, చదువు సంస్కారం నేర్పుతుంది అంటారు.. మరి మన చదువులు ఏమి నేర్పుతున్నాయి. ఎటువైపు నడిపిస్తున్నాయి..? సభ్యత, సంస్కారం లేని సమాజం మనకు అవసరమా..? ఆత్మీయతలు, అనుబంధాలు లేని జీవితం వ్యర్ధం కాదా..? ఎదుటి వారికి ఏ అర్హత లేకున్నా సరే వారిని గౌరవించు. ఎందుకంటే నీవిచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది. విజ్ఞానే వినయ సంపన్నేన వినయ సంపన్నేన బ్రాహ్మణ అన్నారు. ఆధునికతను ఆహ్వానిద్దాం, ప్రాచీన గౌరవ, సాంప్రదాయాలను మనం మరువకుండా గౌరవిద్దాం, భావితారాల వారికి వారసత్వ సంపదగా అందజేద్దాం.

English summary
Many changes witnessed these days in human relations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X